
పుణె : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తనకు ద్వేషం లేదని మరోసారి చెప్పారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఐతే.. దేశ ఆర్థిక వ్యవస్థను తన విధ్వంసక ఆలోచనతో కోలుకోలేని దెబ్బ తీశాడని ఆయన విమర్శించారు. పుణెలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన క్యాంపస్ ఇంటరాక్షన్ లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ, జీడీపీ, మహిళా రిజర్వేషన్లు, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం లాంటి అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు రాహుల్. రాజకీయాలు ప్రేమ, ఆప్యాయత లేనివిగా మారాయా అన్న ప్రశ్నకు రాహుల్ ఆసక్తిగా బదులిచ్చారు. “నరేంద్రమోడీని నేను ప్రేమిస్తున్నాను. ఆయనపై ద్వేషం కానీ.. ఆగ్రహం కానీ నాకు లేవు. కానీ… ఆయనకు నాపై కోపం ఉంది” అన్నారు.
“నోట్లరద్దు అనేది ఓ వినాశక ఆలోచన. అది దేశ ఎకానమీపై భయంకరమైన ప్రభావం చూపింది. GDP 2శాతం తగ్గింది. లక్షల్లో ఉద్యోగాలు పోయాయి. నోట్లరద్దు అనేది దేశానికి తగిలిన గాయం. ఆ గాయం ప్రభావం ఎప్పటికీ ఉంటుంది. జరగకూడని నష్టం మోడీ హయాంలో జరిగిపోయింది” అన్నారు.
జనాభా అధికంగా ఉన్న ఇండియా, చైనా దేశాల్లో నిరుద్యోగ సమస్యను పోల్చారు రాహుల్. “రోజుకు 50వేల ఉద్యోగాలను చైనా పుట్టిస్తుంది. కానీ ఇండియాలో రోజుకు 27వేల ఉద్యోగాలు పోతున్నాయి. ఓ వ్యక్తి నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని మనం లెక్కచేయడం లేదు. యూనివర్సిటీలు, వ్యాపారాలు, సంస్థల మధ్య సంబంధం తెగిపోయింది. ఉద్యోగాలు రావాలంటే అక్కడ ఓ లింక్ ఏర్పడాలి. యూనివర్సిటీలను నెట్ వర్క్ లోకి తీసుకొచ్చి.. ఉద్యోగాలు క్రియేట్ చేయాల్సి ఉంది”
“దేశంలో ఎంతో సంపద ఉంది. అది పేదలకు చేరాలి. పేదల అకౌంట్లలో ఏటా రూ.72వేలు జమచేసే స్కీమ్ పై మేం ఎంతో పరిశోధన చేశాం. అది కచ్చితంగా అమలై తీరుతుంది. ఈ స్కీమ్ తో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఆ డబ్బుతో పేదలు వస్తువులు కొంటారు. ఉద్యోగాలు సంపాదిస్తారు. ఆర్థికవ్యవస్థ గాడిలో పడుతుంది.”
నీతి ఆయోగ్ అనేది స్వల్పకాల లక్ష్యాలను నిర్దేశించుకుని రూపొందించారనీ… కానీ.. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం వ్యూహాత్మక ఆలోచనలు చేసే ‘ప్రణాళిక సంఘం’ దేశానికి అవసరం అన్నారు రాహుల్ గాంధీ.
రాజకీయాల నుంచి 60 ఏళ్లకు రిటైర్ కావడం బెటర్ అని అభిప్రాయపడ్డారు.
సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిట్ ను ఎయిర్ ఫోర్స్ కు ఇవ్వాలని.. దీనిని ప్రధాని మోడీ పొలిటిసైజ్ చేస్తున్నప్పుడు ఇబ్బందికి లోనవుతానని చెప్పారు రాహుల్.