ధరణి సమస్యలపై జనవరి 30 నుంచి కాంగ్రెస్ పాదయాత్ర

ధరణి సమస్యలపై జనవరి 30 నుంచి కాంగ్రెస్ పాదయాత్ర

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూ వివాదాలు, ధరణి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌‌‌‌ ‘సర్వోదయ సంకల్ప పాదయాత్ర’ చేస్తారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌‌‌‌ వెల్లడించారు. జనవరి 30వ తేదీ నుంచి 45 రోజులపాటు భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రాం వరకు 600 కిలోమీటర్లు యాత్ర చేస్తారని తెలిపారు. కాంగ్రెస్‌‌‌‌ లీడర్ రాహుల్‌‌‌‌ గాంధీ ఒకరోజు యాత్రలో పాల్గొంటారని చెప్పారు. పాదయాత్ర, పార్టీ డిజిటల్‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌పై అనుబంధ సంఘాల చైర్మన్‌‌‌‌లతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. అనంతరం గాంధీభవన్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భూ సమస్యలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే సర్కారు భూములను కొల్లగొడుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రెండు రోజులు ఢిల్లీ వెళ్లిన మంత్రులు..తాజ్‌‌‌‌మహల్‌‌‌‌ను చూసొచ్చారా అని ఎద్దేవా చేశారు. 

గాంధీ భవన్‌‌‌‌లో కాకాకు నివాళి
కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌‌‌‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకా సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర మంత్రి గా కాకా చేసిన సేవలను నేతలు పొగిడారు.