హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం ఊహించిందేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతుండటంతో మహేష్ గౌడ్ V6తో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడం అవ్వడం బాధాకరమన్నారు. ఓటింగ్ శాతం తగ్గడం మంచి పరిణామం కాదని అన్నారు. యువత ఓటు హక్కును వినిగించుకోలేదన్నారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో విలువైనదని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ పని చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటైనా.. కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం కాంగ్రెస్ కార్యకర్తలకు అంకితం ఇస్తామని ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు దిశగా దూసుకుపోతుంది. ఐదు రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ 12 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎదురీదుతున్నారు. ఇక బీజేపీ అయితే కనీసం పోటీలో కూడా లేదు. జూబ్లీహిల్స్లో కమలం పార్టీ కనుమరుగైపోయింది. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో సహా ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.
