కాంగ్రెస్ సునామీ .. డిసెంబర్ 9న సర్కార్ ఏర్పాటు చేస్తం: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సునామీ .. డిసెంబర్ 9న సర్కార్ ఏర్పాటు చేస్తం: రేవంత్ రెడ్డి
  • పార్టీ శ్రేణులు ఇప్పట్నుంచే గెలుపు సంబురాలు షురూ చేయాలి
  • బీఆర్ఎస్​కు 25 సీట్లకు మించి రావు.. కామారెడ్డిలో కేసీఆర్​ఓడిపోబోతున్నడు
  • మొదటి కేబినెట్ భేటీలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తం
  • నేను మూడు బాధ్యతల్లో ఉన్నా.. ఏది ఉంచాలో, ఏది తీసేయాలో హైకమాండ్ నిర్ణయిస్తదని కామెంట్​

కామారెడ్డి, వెలుగు:  తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వచ్చిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సునామీ వచ్చినప్పుడు గడ్డ పారలే కొట్టుకుపోతాయని, గడ్డి పోచలు ఎంతని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని, అన్ని సర్వేలు ఇదే చెబుతున్నాయన్నారు. డిసెంబర్​9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. గురువారం సాయంత్రం పోలింగ్ ​ముగిశాక కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి షబ్బీర్​అలీతో కలిసి మీడియాతో రేవంత్ మాట్లాడారు. డిసెంబర్ 3న కాదు.. ఇప్పటి నుంచే కాంగ్రెస్​ శ్రేణులు సంబురాలు షూరూ చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎంతో చైతన్యంతో ఓటు వేశారని, త్వరలోనే దొరల తెలంగాణ అంతమై.. ప్రజల తెలంగాణ వస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామని చెప్పారు. అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్మారని విమర్శించారు. ఓటమి ఎదురైనప్పుడల్లా కేసీఆర్ తన నియోజకవర్గం మారుస్తారని, ఆయన్ను కామారెడ్డి ప్రజలు ఓడించబోతున్నారన్నారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో భాగంగా నవంబర్ 29న శ్రీకాంతాచారి ఆత్మహత్యకు యత్నించారు. డిసెంబర్ 3న చనిపోయారు. 9న సోనియా నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పక్రియ షూరూ చేస్తున్నట్లు అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగానికి.. ఈ ఎన్నికల ఫలితాలకు లింక్ ఉంది. డిసెంబర్ 3న ఫలితాలు వస్తున్నాయి. 9న కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడబోతున్నది’’ అని రేవంత్ చెప్పారు.

మేం సేవకులుగా ఉంటం

‘‘గెలుపోటములు సహజం. గెలిచినోడు రాజు కాదు.. ఓడిన వాడు బంటు కాదు. ప్రజారంజకమైన పాలన అందించాలంటే  ప్రతిపక్షం, పాలకపక్షం బాధ్యతయుతామైన పాత్ర వహించాలి. గతంలో గెలిస్తే రాజు, ఓడితే బానిస తరహాలో శాసనసభను కేసీఆర్ నడిపారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా వ్యవహరించారు. కేసీఆర్ మాదిరిగా మేము నిరంకుశంగా వ్యవహరించబోం. పాలకులుగా ఉండబోం.. సేవకులుగా ఉంటాం” అని రేవంత్ వివరించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాస్వామిక విలువల్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. ముఖ్యమైన అంశాలపై ప్రతిపక్ష సభ్యులు, సంఘాల ప్రతినిధులతో చర్చిస్తామని తెలిపారు. ‘‘మా పాలనలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. మీడియా మిత్రులకు కూడా ఇప్పటి నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. ప్రజల అభిప్రాయాల్ని, సమస్యలు ప్రతిబింబించే వార్తలు రాయొచ్చు. ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ ​అధికారంలోకి రావడం లేదు. ఇక నుంచి బాధ్యతాయుతంగా మాట్లాడుతాం” అని చెప్పుకొచ్చారు. మొదటి మంత్రి మండలి సమావేశంలో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించటం.. ప్రజాస్వామిక పాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. వార్​రూమ్​కాదు.. బీఆర్ఎస్​ వాళ్లు బార్​రూమ్‌‌‌‌‌‌‌‌లో సంబురాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఎంఐఎం బీజేపీతోనే ఉంది

కోదండరాం నేతృత్వంలో అమరవీరులకు సంబంధించిన సంక్షేమం, గుర్తింపు.. ఇతర అన్ని కీలక ఆంశాలపై పార్టీ చర్చిస్తుందని రేవంత్​ చెప్పారు. ‘‘రాష్ట్ర సాధనలో కోదండరాం బాధ్యతగా, కీలకంగా పని చేశారు. ఆయనపై ప్రజలకు విశ్వాసం ఉంటుంది. ఆ బాధ్యత ఆయనకు అప్పగిస్తే బాగుంటుందని అనుకుంటున్నా” అని తెలిపారు. ఎంఐఎం బీజేపీతోనే ఉందని విమర్శించారు. మైనార్టీల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మెజార్టీల విషయంలో ఏ విధానం ఉంటుందో.. మైనార్టీల విషయంలోనూ అదే విధానముంటుందన్నారు. ప్రస్తుతం తాను మూడు బాధ్యతల్లో ఉన్నానని, ఏది ఉంచాలో, ఏది తీసి వేయాలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. తెలంగాణ గెలుపులో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ ఎంతో కీలక పాత్ర పోషించారన్నారు. ఇక్కడి ప్రజలకు కష్టమొస్తే వారు అండగా ఉన్నారని, ఇందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

ఎగ్జిట్ పోల్స్ నిజమైతే క్షమాపణలు చెప్తవా?

ఎగ్జిట్ పోల్స్ రబ్బిష్ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లపై రేవంత్​ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు ఆయన సిద్ధమా అని సవాల్​విసిరారు. బీఆర్ఎస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను మొదటి నుంచి చెబుతున్నట్లు బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు 25 సీట్లకు మించి రావన్నారు. ఈ కామెంట్లకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. ‘‘ప్రతిసారి పోలింగ్ ముగిసిన వెంటనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటికి వచ్చి ప్రెస్​మీట్ పెట్టేటోడు. ఈసారి కేటీఆర్ వచ్చాడు. ఎగ్జిట్ పోల్స్ చూసి కేసీఆర్ బయటకు రాలేకపోయాడు. కేటీఆర్ ఇప్పటికీ బెదిరింపు ధోరణిలోనే మాట్లాడుతుండు. కొడుకు వచ్చిండంటేనే బీఆర్ఎస్ ​దుకాణం మూతపడిందని అర్థం’’ అని విమర్శించారు.