హైదరాబాద్, వెలుగు: ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగనున్న మహా ధర్నాను విజయవంతం చేయడంపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా చర్చించారు. ఇప్పటికే ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా10 లక్షల సంతకాలు సేకరించిన పీసీసీ.. వాటిని ట్రక్కులో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి చేరవేసింది. ఈ ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం కేబినెట్, పీసీసీ చీఫ్, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. అయితే ఈ ధర్నాను విజయవంతం చేసేందుకు రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులను, కార్యకర్తలను తరలించడంపై సీఎం, పీసీసీ చీఫ్ చర్చించుకున్నారు.
పంచాయతీ ఎన్నికలు జరిగిన ప్రాంతాల నాయకులను, కార్యకర్తలను, పట్టణ ప్రాంతాల నాయకులను పెద్ద సంఖ్యలో తరలించేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. అనంతరం మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సాధించిన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేందుకు మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకోవడంపై కూడా సీఎం పలు సూచనలు చేశారని చెప్పారు.

