వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెల్వదు : మురళీధర్ రావు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెల్వదు  :  మురళీధర్ రావు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోలేక పోతున్నదని బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధర్ రావు అన్నారు. ఇందుకు చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్ రాష్ట్రాలే ఉదాహరణ అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఇలానే ఉండనుందని జోస్యం చెప్పారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెలను తొలగించడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని పేర్కొన్నారు. 

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయకపోతే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను గద్దె దించడానికే ఇక్కడి ప్రజలు ప్రాధాన్యత ఇచ్చారని, దీనికి ప్రత్యామ్నాయంగా వారికి బీజేపీ కన్నా.. కాంగ్రెస్ బలంగా కనిపించిందని, అందుకే ఆ పార్టీని గెలిపించారన్నారు. అస్సాం వంటి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు.. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రావడానికి పెద్ద ఇబ్బందేమీ ఉండదని భావించామని, అందుకే మోదీ, అమిత్ షా సీరియస్‌గా ప్రచారం చేశారన్నారు. 

ఇక్కడి ప్రజలు కేసీఆర్‌‌ను, ఆయన కుటుంబాన్ని గద్దె దించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారని, దీంతో బీజేపీ బీసీ సీఎం ప్రకటనను వారు పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓడిపోవడం అనేది కొత్తేమీ కాదని, 2018 ఎన్నికల్లో రాజాసింగ్ మినహా మిగతా నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారని గుర్తుచేశారు.