హైదరాబాద్: తెలంగాణ మున్సిపోల్స్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అధికార కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. ప్రధానంగా 'వీ6 -వెలుగు' ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించే దిశగా వెళ్తోంది. ఆ పార్టీకి ఏకంగా 85 నుంచి 95 మున్సిపాలిటీలు దక్కుతాయని అంచనా వేయగా.. బీఆర్ఎస్ 15 నుంచి 20 స్థానాలకు, బీజేపీ 2 నుంచి 5 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి.
ఇక ఎంఐఎం 2 చోట్ల గెలిచే చాన్స్ ఉంది. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్ల విషయానికొస్తే.. 5 చోట్ల కాంగ్రెస్ జండా ఎగురుతుందని, ఒకచోట బీజేపీ గెలుస్తుందని, మరోచోట కాంగ్రెస్ -బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. మరోవైపు 'పీపుల్స్ పల్స్' సంస్థ సర్వే గణాంకాలు కూడా ఇదే తరహా ఫలితాలను విశ్లేషించాయి.
కాంగ్రెస్ పార్టీకి 68 నుంచి 76 మున్సిపాలిటీలు, బీఆర్ఎస్ కు 29 నుంచి 36 స్థానాలు లభిస్తాయని, బీజేపీ 3 నుంచి 5 స్థానాల్లో గెలిచే వీలుందని అంచనా వేసింది. కార్పొరేషన్ల వారీగా చూస్తే.. రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాలను దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మాత్రం బీజేపీ హవా కొనసాగుతోందని, అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల కంటే కమలనాథులే ఎక్కువ డివిజన్లలో గెలుస్తారని పీపుల్స్ పల్స్ వెల్లడించింది.
