జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయభేరి మోగించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ సాధించారు. బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్‌పై 24,658 వేల ఓట్ల మెజార్టీతో రికార్డ్ విజయం సాధించారు నవీన్ యాదవ్. కాసేపట్లో నవీన్ యాదవ్ విజయంపై అధికారిక ప్రకటన చేయనుంది ఎన్నికల కమిషన్‌. జూబ్లీహిల్స్‎లో కాంగ్రెస్ రికార్డ్ స్థాయి విజయం సాధించడంతో గాంధీ భవన్‎లో సంబరాలు అంబరాన్నంటాయి. 

కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. డప్పులు వాయిస్తూ.. బాణా సంచా పేల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. రప్పా రప్పా, తగ్గేదేలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ డ్యాన్సులు చేశారు. బాణసంచా, బ్యాండ్ చప్పుళ్లతో గాంధీ భవన్ పరిసరాలు మార్మోగిపోతున్నాయి. యూసఫ్ గూడలోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం, కార్యాలయంలోనూ విజయోత్సవాలు ఘనంగా షూరు అయ్యాయి. 

కాంగ్రెస్ శ్రేణులు, నవీన్ యాదవ్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. నవీన్ యాదవ్ ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో నవీన్ యాదవ్ నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.