కేటీఆర్​ అహంకారాన్ని తగ్గించుకో

కేటీఆర్​ అహంకారాన్ని తగ్గించుకో
  •     మంత్రి పొన్నంకు క్షమాపణ చెప్పకపోతే అడ్డుకుంటాం
  •     గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన 

హుస్నాబాద్​, వెలుగు : గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల పనులను కాంగ్రెస్​ఐదేండ్లళ్లలో ముప్పావుమందంజేస్తే పదేండ్ల బీఆర్ఎస్​ పావలావంతు కూడా పూర్తి చేయలేదని కాంగ్రెస్​, జేఏసీ నాయకులు విమర్శించారు. ఇందుకు ఆధారాలు ఉన్నా మాజీ మంత్రి కేటీఆర్​ ప్రాజెక్టును తామే పూర్తిచేశామని అబద్ధాలు చెబుతున్నారన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, కమీషన్లు దొబ్బుకునేందుకు ట్రయల్​రన్​ చేశారన్నారు. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్​పై అహంకారపూరితంగా కేటీఆర్​మాట్లాడుతూ, గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై అబద్ధాలు చెప్పినందుకు నిరసనగా శనివారం కాంగ్రెస్​ కార్యకర్తలు

ప్రజాసంఘాల నాయకులు ప్రాజెక్టు వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జేఏసీ హుస్నాబాద్​ నియోజకవర్గ అధ్యక్షుడు కవ్వ లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్​ మేకల వీరన్న, టీపీసీసీ మెంబర్​ కేడం లింగమూర్తి, హుస్నాబాద్​ మండల అధ్యక్షుడు బంక చందు, సింగిల్​విండో చైర్మన్​ బొలిశెట్టి శివయ్య ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు కేటీఆర్​ అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ప్రాజెక్టును కంప్లీట్​ చేశామన్న కేటీఆర్​ మాటల్లో నిజమెంత ఉందో చూపించారు. కాంగ్రెస్​ హయాంలో తవ్విన కాల్వలే తప్ప, బీఆర్ఎస్​చేసిన పనులు లేవన్నారు

అధికారం పోయిందనే కేటీఆర్, హరీశ్​రావు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టు కట్టిస్తానన్న అప్పటి సీఎం కేసీఆర్​ పదేండ్లైనా ప్రాజెక్టును పూర్తిచేయకపోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రశ్నిస్తే, కేటీఆర్​ అహంకారంతో దబాయిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్​కు కేటీఆర్​క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. లేదంటే ఆయనను అడ్డుకొని నిలదీస్తామని హెచ్చరించారు.