కనీస ఆదాయ పథకం : విధివిధానాలు ప్రకటించిన కాంగ్రెస్

కనీస ఆదాయ పథకం : విధివిధానాలు ప్రకటించిన కాంగ్రెస్

ప్రధాన ఎన్నికల హామీ అయిన కనీస ఆదాయ పథకం విధివిధానాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దేశంలోని 25 కోట్ల మంది పేదలకు కనీస ఆదాయం అందిస్తామన్నారు రాహుల్ గాంధీ. దేశంలోని 20శాతం మందికి కనీస ఆదాయం అందిస్తామన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు. మినిమం ఇన్ కమ్ లైన్ ను రూ.12వేలుగా నిర్ణయించామన్నారు. ఆలోపు ఆదాయం ఉన్నవారికి పథకం అమలు చేస్తామన్నారు. సగటున ప్రతీ కుటుంబానికి ఏడాదికి 72వేలు అందిస్తామని ప్రకటించారు. ఆ లెక్కన ఒక్కో కుటుంబానికి నెలకు 6వేల వరకు అందే అవకాశముంది. కనీస ఆదాయం పథకంతో దేశంలోని 5 కోట్ల పేద కుటుంబాల్లోని 25కోట్ల మంది ప్రజలకు లబ్ది జరుగుతుందన్నారు రాహుల్. ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు రాహుల్ గాంధీ.

కనీస ఆదాయ పథకాన్ని హిందీలో న్యూన్ తమ్ ఆయ్ యోజన(NTAY)గా పిలుస్తున్నారు. దీనిని పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేసి తర్వాత దేశమంతటా అమలు చేస్తామన్నారు. పేదరికంపై పోరాటంలో ఉపాధిహామీ తర్వాత కనీస ఆదాయ పథకమే చివరి దాడి అని రాహుల్ అన్నారు. తానేమీ మహాత్ముడిని కావాలనుకోవడంలేదన్నారు. మోడీలాగా దేశాన్ని మాత్రం రెండుగా  విభజించాలని అనుకోవడంలేదన్నారు.

కాంగ్రెస్ స్కీమ్ పై బీజేపీ రివర్స్ ఎటాక్

పేద ప్రజలకు రాహుల్ గాంధీ బూటకపు కలలను చూపిస్తున్నారని ఆరోపించింది బీజేపీ. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు గరీబి హటావో అన్నప్పటికీ ఏమీ జరగలేదన్నారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. దేశంలో పేదరికం కాంగ్రెస్ వారసత్వమేనన్నారు.

అంతకుముందు రాహుల్ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, మల్లికార్జున  ఖర్గే, ప్రియాంక గాంధీ సహా… CWC సభ్యులు, AICC కార్యదర్శులు హాజరయ్యారు. ముఖ్యంగా NYAY పథకంతో పాటు, లోకసభ ఎన్నికలు, పొత్తులు, మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించారు.