27 సీట్లలో తేలని పంచాది ... కాంగ్రెస్ సెకండ్ లిస్టు అందుకే లేటు!

27 సీట్లలో  తేలని పంచాది ... కాంగ్రెస్ సెకండ్ లిస్టు అందుకే లేటు!
  • 33 స్థానాలపై క్లారిటీ.. లెఫ్ట్ పార్టీలకు నాలుగు సీట్లు ఇచ్చేందుకు ఓకే
  • మిగతా సీట్లలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలతో చిక్కుముడి
  • కొత్తగా చేరే నేతల కోసం 10 స్థానాల్లో వేచి చూసే ధోరణి!
  • మూడు రోజులుగా కేసీ వేణుగోపాల్‌‌తో లీడర్ల వరుస భేటీలు
  • కొంత ఆలస్యమైనా.. ఒకేసారి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయాలనే యోచన

న్యూఢిల్లీ, వెలుగు:  అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీలో చిక్కుముడి వీడటం లేదు. పాత, కొత్త నేతల మధ్య పోటీ.. సామాజిక వర్గాల వారీగా సర్దుబాటు.. సర్వేల్లో వస్తున్న ఫలితాల నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీ క్లారిటీకి రాలేకపోతున్నది. పలు నియోజకవర్గాల్లో కొత్తగా చేరికలు, కొన్నిచోట్ల మూడుకు మించి అప్లికేషన్లు రావడం, అభ్యర్థుల విషయంలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో 27 సీట్ల విషయంలో సందిగ్ధం నెలకొందని తెలుస్తున్నది. సెకండ్ లిస్టు ఆలస్యం కావడానికి ఇదే కారణమని సమాచారం. ఇటీవల జరిగిన భేటీ సందర్భంగా రెండు స్థానాలపై నేతల్లో వేర్వేరు అభిప్రాయాలు ఉండడంతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.


దీంతో కొంత ఆలస్యమైనా సరే.. ఒకే సారి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేద్దామని నేతలకు ఆయన సూచించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే మూడు రోజులుగా పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ నేతలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో పలు స్థానాలపై క్లారిటీ రాగా.. కాంగ్రెస్ గూటికి తిరిగి చేరుతున్న నేతల కారణంగా మరో 10 స్థానాలపై వేచి చూసే ధోరణిలో ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఈ స్థానాల్లో ఏం చేద్దాం?

అత్యధికంగా 32 అప్లికేషన్లు వచ్చిన ఇల్లెందు నియోజకవర్గం హాట్ సీట్‌గా మారింది. అప్లై చేసిన వారిలో 15 మంది లంబాడాలు ఉండటంతో.. ఆ వర్గానికి అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా స్క్రీనింగ్ కమిటీ అంచనాకు వచ్చింది. మహబూబాబాద్ సీటు కోసం కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే వరుసగా మూడు సార్లు ఓడిపోవడం, సర్వేలో ఆశించినంత మేర ఫీడ్‌బ్యాక్ రాకపోవడంతో ఆయన పేరును పక్కన పెట్టినట్లు తెలిసింది. దీంతో ఆయన కూడా ఇల్లెందు వైపు చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీజేఆర్ కూతురు విజయా రెడ్డి, కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి విషయంలోనూ పార్టీ ఆలోచనలో పడింది. రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిణ్ రెడ్డి.. ఖైరతాబాద్ సీటు అడుగుతున్నారు. అయితే ఈ సీట్ నుంచి విజయా రెడ్డి బరిలో ఉండటంతో రోహిణ్‌ రెడ్డిని పక్కన పెట్టినట్లు తెలుస్తున్నది. దీంతో అంబర్ పేట్ సీటును రోహిణ్‌ అడుగుతున్నట్లు సమాచారం. సర్వేలో విష్ణువర్ధన్ వెనకబడడంతో.. జూబ్లీహిల్స్ స్థానాన్ని మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు ఇవ్వొచ్చని అంటున్నారు. 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సుభాష్ రెడ్డి, మదనమోహన్ రావు మధ్య గట్టి పోటీ ఉంది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేకే మహేందర్ రెడ్డి, ఉమేశ్ రావు (కేటీఆర్ బంధువు), సంగీతం శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ పద్మశాలీల ఓట్లు అత్యధికంగా ఉండడంతో ఉదయ్ పూర్ డిక్లరేషన్ అనుగుణంగా ఈ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని డిమాండ్లు వస్తున్నాయి. నారాయణ ఖేడ్ నుంచి సురేశ్ షెట్కర్, సంజయ్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. సత్తుపల్లి స్థానంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేణుకా చౌదరి, రేవంత్ రెడ్డి చెరో పేరును చెప్తున్నారు. కానీ సర్వేలో మాత్రం రేణుకా చౌదరి ప్రతిపాదించిన రాగమయి ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. వనపర్తి నుంచి చిన్నారెడ్డి, మేఘా రెడ్డి మధ్య పోటీ ఉంది. 

చిన్నారెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జడ్చర్ల సీటును యూత్ కాంగ్రెస్ నేత శివసేన రెడ్డి ఆశిస్తున్నారు. కానీ ఇక్కడ బీసీ అభ్యర్థిని బరిలో దింపాలని పార్టీ యోచిస్తున్నదని సమాచారం. ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అగ్ర నేతల సమక్షంలో హస్తం గూటికి చేరనున్నట్లు తెలిసింది. కొత్తగా చేరేవారికి కొన్ని స్థానాలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా స్థానాలను ఆశిస్తున్న ఆశావాహులను ఢిల్లీకి తీసుకొచ్చి వారి భవిష్యత్తుకు అగ్ర నేతలతో హామీ ఇప్పించనున్నట్లు తెలిసింది.

37 సీట్లు ఫైనల్

గతంలో అభ్యర్థుల తొలి లిస్టు రిలీజ్‌ చేయడానికి ముందు మూడు సార్లు సమావేశమై, దాదాపు 20 గంటలు చర్చించిన స్క్రీనింగ్ కమిటీ.. 60 స్థానాలపై మాత్రమే క్లారిటీకి వచ్చింది. ఈ జాబితా కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ వద్దకు వెళ్లాక.. 55 స్థానాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ నేపథ్యంలో తొలి లిస్టును ఈ నెల 15న సీఈసీ రిలీజ్ చేసింది. ఇక అప్పటి నుంచి మిగిలిన 64 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై పార్టీ మల్లగుల్లాలు పడుతున్నది. ఈ నెల 25న భేటీ అయిన సీఈసీ.. ఇందులో 33 మందిని ఫైనల్ చేసింది. అలాగే లెఫ్ట్ పార్టీలకు నాలుగు సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. దీంతో 37 సీట్లపై క్లారిటీ వచ్చింది. పెండింగ్ లో ఉన్న 27 స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది.