- గుండెకు కొద్దిగా పక్కనుంచి దూసుకెళ్లిన బుల్లెట్
- తప్పిన ప్రాణాపాయం..అంబర్‌పేటలో ఘటన
అంబర్ పేట, వెలుగు: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అంబర్ పేట సీపీఎల్‌లోని ఆయుధ కారాగారం వద్ద ఆదివారం ఏపీ క్యాడర్‌కు చెందిన కానిస్టేబుల్ ఎస్. గోవర్దన్ రెడ్డి సెంట్రీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అర్ధరాత్రి సుమారు 12:10 గంటల సమయంలో గోవర్దన్ రెడ్డి డ్యూటీ ఎక్కే ముందు తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ తుపాకీని చెక్ చేస్తూ ఉండగా, ఒక్కసారిగా మిస్ ఫైర్ అయ్యింది.
అదృష్టవశాత్తు బుల్లెట్ గుండెకు కొద్దిగా పైభాగం నుంచి వెళ్లిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గమనించిన సిబ్బంది వెంటనే బాధితుడిని నాంపల్లి లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
