గ్రామాలలో విభిన్న రాజకీయ పార్టీలకు చెందిన నాయకత్వం రిజర్వేషన్ పరంగా అభ్యర్థులను ఖరారుచేసి ఇప్పటికే ఎవరికివారు అంతర్గత ప్రచార కార్యకలాపాలలో నిమగ్నమై ఉండటం గమనించవచ్చు. గ్రామాలలో ఎన్నికయ్యే సర్పంచ్ పైనే గ్రామాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. గ్రామ ప్రథమ పౌరుడంటే ఇంటికి పెద్దదిక్కువలే గ్రామానికి పెద్ద. గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించి నిరంతరం వారి క్షేమం, సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతుండాలి. అంతేగానీ ఏదో హోదా కోసమో ఆర్థికపరమైన వ్యాపారంగా భావించి లక్షలలో ఖర్చుపెట్టి వడ్డీతో సహా సంపాదించుకోవాలనో ఎన్నికలలో పోటీ చేయవద్దు. గ్రామ ప్రజలు సైతం పార్టీలు, కులాలు, మతాలకతీతంగా డబ్బుకు ఎలాంటి ప్రాధాన్యతనివ్వకుండా, సేవాదృక్పథంతో గ్రామాభివృద్ధికి పాటుపడే నాయకున్ని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
- డా. పోలం సైదులు
