
హైదరాబాద్, వెలుగు: కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 సెంటర్లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనుంది. 15,644 సివిల్, ఏఆర్, 614 ఎక్సైజ్, 63 ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి బోర్డు నోటిఫికేషన్ ఇవ్వగా.. మొత్తం 9,54,064 అప్లికేషన్లు వచ్చాయి. దాదాపు 6.61 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ ఎగ్జామ్ కు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించబోమని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు చెప్పారు. సెంటర్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావొద్దని సూచించారు.