ఎముకలు కొరికే చలిలో పోలీసులకు మిడ్ కెరీర్ శిక్షణ

ఎముకలు కొరికే చలిలో పోలీసులకు మిడ్ కెరీర్ శిక్షణ
  •     చలికి తట్టుకోలేక పోతున్నామంటున్న సీనియర్ కానిస్టేబుల్స్
  •     55 ఏండ్లు పైబడిన వారిలో అనారోగ్య సమస్యలు

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్  ఈస్ట్‌‌ జోన్‌‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌‌(57) కి హెడ్‌‌ కానిస్టేబుల్‌‌గా ప్రమోషన్ వచ్చింది. మిడ్ కెరీర్ ట్రైనింగ్‌‌లో భాగంగా గత నెలలో ఆయన ఫస్ట్‌‌ బ్యాచ్‌‌  ట్రెయినింగ్‌‌కి  వెళ్లారు. చలితో శ్వాస సంబంధ సమస్యతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అధికారులు ఆయనను హాస్పిటల్‌‌కి తరలించారు. చికిత్స అనంతరం పోలీస్‌‌ స్టేషన్‌‌కే పరిమితం చేశారు. ఈ ఏడాది హెడ్ కానిస్టేబుల్స్‌‌గా ప్రమోషన్స్‌‌ పొందిన వారిలో 55 ఏండ్లకు పైబడిన పోలీసులు అంతా ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు. ప్రమోషన్‌‌ తరువాత నిర్వహించే 45 రోజుల శిక్షణతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని వారు పేర్కొంటున్నారు.

రిటైర్మెంట్‌‌ ఏజ్‌‌లో మాకెందుకీ ‘శిక్ష’ణ అంటున్నారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవుతున్నామని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో ప్రకారం పోలీస్‌‌ రిటైర్మెంట్‌‌ వయసు 61 ఏండ్లకు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో 58 ఏండ్లకు పదవీ విరమణ చేయాల్సిన పోలీసులకు మరో మూడేండ్ల సర్వీసు పెరిగింది. వారిలో కానిస్టేబుల్‌‌  స్థాయి నుంచి హెడ్‌‌ కానిస్టేబుల్స్‌‌గా ప్రమోషన్ పొందిన వారు రిటైర్మెంట్‌‌ సమయంలోనూ ఫిజికల్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో ఫిట్‌‌నెస్‌‌ పెంచేందుకు పోలీస్  శాఖ  స్పెషల్‌‌  ట్రెయినింగ్  ప్రోగ్రాం అమలు చేస్తున్నది. పోలీస్ మ్యానువల్ ప్రకారం ‘మిడ్‌‌కెరీర్  ట్రైనింగ్‌‌’ పేరుతో శిక్షణ ఇస్తోంది. 

70  శాతం 50 ఏండ్లు పైబడిన వారే

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4,637 మంది పోలీసులు హెడ్‌‌ కానిస్టేబుల్స్‌‌గా ప్రమోషన్లు పొందారు. వారిలో 47  నుంచి 57 ఏండ్ల వయస్సున్న వారున్నారు. వారిలో 70 శాతం మంది 50 ఏండ్లకు పైబడిన వారే. ఆ కానిస్టేబుల్స్ ను రెండు బ్యాచ్‌‌లుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు. మహిళా కానిస్టేబుల్స్‌‌కు పోలీస్ అకాడమీలో, మగ కానిస్టేబుల్స్‌‌కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ ట్రెయినింగ్ సెంటర్స్‌‌లో శిక్షణ ఇస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా గత నెల 14 నుంచి మిడ్ కెరీర్‌‌  ట్రెయినింగ్ ప్రారంభమైంది. ఈ నెల 24తో మొదటి బ్యాచ్‌‌ శిక్షణ పూర్తికానుంది. రెండో బ్యాచ్‌‌  ట్రెయినింగ్‌‌పూర్తి చేసిన తరువాత వారందరికీ వివిధ స్థానాల్లో నియమిస్తారు. ఇందు కోసం ఫిజికల్‌‌ ఫిట్‌‌నెస్‌‌ తప్పనిసరి కావడంతో కామన్ ట్రైనింగ్‌‌ ఇస్తుంటారు.

శిక్షణ వల్లే ఆరోగ్య సమస్యలు

50 ఏండ్లు పైబడిన వారిలో చాలా మంది ఇప్పటికే బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు పోస్ట్‌‌ కొవిడ్‌‌  సమస్యలు ఎదుర్కొంటున్న వారు కూడా అధికంగానే ఉన్నారు. అలాంటి వారిని సాధారణంగా స్టేషన్‌‌  డ్యూటీలో నియమిస్తుంటారు. తమ లాంటి వారికి శిక్షణ ఇవ్వడం వలన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని కానిస్టేబుల్స్ చెబుతున్నారు. రోజూ ఉదయం 5.30 గంటలకే శిక్షణ ప్రారంభం అవుతుందని, ఎముకలు కొరికే చలిలో పరేడ్ నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 24తో శిక్షణ ముగియనుంది.