ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది : నారా లోకేశ్

ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది  : నారా లోకేశ్

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ విమర్శించారు. 45 ఏండ్లుగా తెలంగాణతో సహా రాయలసీమ, ఆంధ్రను అభివృద్ధి చేసిన చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 24 రోజులుగా జైల్లో పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ.. నారా భువనేశ్వరి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఢిల్లీలో లోకేశ్​, టీడీపీ ఎంపీలు ‘సత్యమేవ జయతే’ దీక్ష చేపట్టారు. 

ఈ దీక్షకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు, ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ఢిల్లీ యూనివర్సిటీ తెలుగు విద్యార్థులు మద్దతు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు దీక్షలో పాల్గొన్న లోకేశ్, టీడీపీ ఎంపీలకు చిన్నారులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ పేరును.. పిచ్చి జగన్ గా మార్చినట్లు చెప్పారు. 

స్కిల్ డెవలప్​మెంట్​కేసులో బాబుకు బెయిల్ వస్తుందని మరో మూడు కేసులు రెడీ చేశారని ఆరోపించారు. తన కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని మంత్రులే బహిరంగంగా చెబుతున్నారని మండిపడ్డారు. నేడు సుప్రీంకోర్టు ముందుకు బాబు పెట్టుకున్న పిటిషన్ రానుందని, తీర్పును బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.