- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం
- హైకోర్టు జడ్జిలకు 65, సుప్రీం జడ్జిలకు 67 ఏండ్లకు పెంచాలని ప్రపోజల్
న్యూఢిల్లీ: హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల రిటైర్మెంట్ ఏజ్ ను పెంచాలని బార్ కౌన్సిల్ ఆఫ్ఇండియా (బీసీఐ) తీర్మానం చేసింది. ఇటీవల రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు, హైకోర్టు బార్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లతో జరిగిన జాయింట్ మీటింగ్ లో ఈ మేరకు తీర్మానించినట్లు గురువారం బీసీఐ తెలిపింది. హైకోర్టు జడ్జిల రిటైర్మెంట్ ఏజ్ ప్రస్తుతం 62 ఏండ్లు ఉండగా.. 65కు పెంచాలని, సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ వయస్సును 65 నుంచి 67 ఏండ్లకు పెంచాలని తీర్మానాన్ని ఆమోదించినట్లు చెప్పింది. జడ్జిల రిటైర్మెంట్ ఏజ్ పెంపు కోసం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానించినట్లు పేర్కొంది.
ఈ తీర్మానాన్ని ప్రధానికి, కేంద్ర న్యాయ శాఖకు పంపనున్నట్లు వెల్లడించింది. వివిధ ఫోరమ్లలో అనుభవం ఉన్న అడ్వకేట్లను చైర్ పర్సన్లుగా నియమించేందుకు వీలుగా చట్టాలను సవరించాలని పార్లమెంటుకు కూడా ప్రతిపాదన పంపాలని బీసీఐ నిర్ణయించింది. కాగా, సుప్రీంకోర్టు జడ్జిలు 65 ఏండ్లకే రిటైర్మెంట్ అంటే చిన్న వయసులోనే రిటైర్ అవుతున్నట్లు భావిస్తున్నానని, జడ్జిల పదవీ విరమణ వయసు పెంచాలని గత ఏప్రిల్లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు ఏజీ కేకే వేణుగోపాల్ కూడా మద్దతు తెలిపారు.
