తెలంగాణలో 2.23 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి: కేంద్రం

తెలంగాణలో 2.23 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి: కేంద్రం

సౌలతుల కల్పనకు  832 కోట్లు ఇచ్చినం, రాజ్య సభలో కేంద్రం వెల్లడి


న్యూఢిల్లీ, వెలుగు: ప్రధానమంత్రి ఆవాస్‌‌ యోజన (అర్బన్‌‌) స్కీమ్ కింద తెలంగాణలో ఇప్పటివరకు 2,23,361 ఇండ్ల నిర్మాణం పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే, గడిచిన మూడేండ్లలో 1,26,360 పూర్తయినట్లు పేర్కొంది. ఇందుకోసం కేంద్రం ఆర్థిక సహకారం కింద రూ. 1.17 కోట్లు రిలీజ్ చేయగా... తెలంగాణ సర్కార్ ఒక్క రూపాయి కూడా ఉపయోగించుకోలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్‌‌ కిషోర్‌‌ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 2015 జూన్ 25 నుంచి రాష్ట్రంలోని 33 జిల్లాలకు 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇందులో 2,44,039 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు బీఆర్‌‌ఎస్‌‌ ఎంపీ పార్థసారథి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి జవాబు ఇచ్చారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ కు 1,52,511 మంజూరు చేయగా, 1,40,865 ఇండ్లు పూర్తయినట్లు తెలిపారు. వరంగల్ రూరల్ కు 535 ఇండ్లు మంజూరు చేయగా, కేవలం 36 ఇండ్లు మాత్రమే నిర్మించినట్లు వెల్లడించారు. పీఎంయూవై(యూ) కింద తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 27,858 గృహాలు సాంకేతికతను ఉపయోగించి నిర్మించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. అలాగే మౌలిక వసతుల కల్పనకు అమృత్ మిషన్ కింద తెలంగాణకు రూ. 832 కోట్లు ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు.