మూసీపై బ్రిడ్జీలు ఇప్పట్లో అయితయా?

మూసీపై బ్రిడ్జీలు ఇప్పట్లో అయితయా?

హైదరాబాద్, వెలుగు:మూసీ నదిపై బ్రిడ్జిల నిర్మాణం ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు. గ్రేటర్ వాసులకు జర్నీ మరింత ఈజీ అయ్యేలా రూ.545 కోట్లతో  మూసీ నదిపై15 బ్రిడ్జిలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చి ఆరు నెలలు అవుతోంది. కానీ ఇంతవరకు ఒక్కచోట కూడా పనులు మొదలుపెట్టలేదు. ఇంకా భూసేకరణ ప్రక్రియ పూర్తికాలేదు. మొదట్లో రెవెన్యూ ఆఫీసర్లు హడావుడి చేసినప్పటికీ మూసీ పరివాహక ప్రాంతాల్లోని జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అంతటితో వదిలేశారు. కేవలం బ్రిడ్జిలు ప్రతిపాదించిన చోట మాత్రమే భూసేకరణ చేస్తే పెద్దగా వ్యతిరేకత ఉండేది కాదు. కానీ ఆఫీసర్లు మూసీకి ఇరువైపులా ఉన్న ఆక్రమణల మొత్తాన్ని తొలగిస్తామని నోటిఫికేషన్ రిలీజ్​చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. భూసేకరణ ప్రక్రియ నిలిచింది. 
ఈ విషయంపై అధికారులను అడిగితే త్వరలోనే బ్రిడ్జిల పనులు స్టార్ట్ ​చేస్తామని సమాధానం ఇస్తున్నారు. కానీ ఎప్పటికి  పూర్తి చేస్తారనే దానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. 

3 డిపార్ట్​మెంట్ల ఆధ్వర్యంలో..

హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్ డీసీఎల్) పర్యవేక్షించనున్న వంతెనల నిర్మాణానికి అయ్యే ఖర్చును హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ  భరించాల్సి ఉంది. కానీ బ్రిడ్జిల నిర్మాణంలో కీలకమైన భూ సేకరణ ఇంతవరకు పూర్తికాకపోవడంతోనే పనులు మొదలు ​కావడం లేదు. 3 డిపార్టమెంట్ల అధికారులు కూడా బ్రిడ్జిల విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎక్కడ నిర్మించాలనే దానిపై క్లారిటీ వచ్చాక కూడా ప్రాసెస్​ముందుకు కదలకపోవడంతో అధికారులపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే సిటీ ప్రజలు ఆయా ప్రాంతాల్లో మూసీ నదిని దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జిలు లేక 100 మీటర్ల దూరానికి కిలోమీటర్లు మేర ప్రయాణించాల్సి వస్తోంది. అదే 15 బ్రిడ్జిలు పూర్తయితే టైమ్​తో పాటు ఇంధనం ఆదా అవుతుంది.

ప్రతిపాదించింది ఈ ప్రాంతాల్లోనే..

అఫ్జల్​గంజ్ వద్ద ఐకానిక్ పాదచారుల వంతెన, కారిడార్ నం.99 వద్ద మిస్సింగ్ లింక్ బ్రిడ్జి, ఇబ్రహీంబాగ్ కాజ్ ​వెనూను కనెక్ట్ చేసేలా హై లెవల్ బ్రిడ్జి, సన్ సిటీ నుంచి చింతల్ మెట్ కనెక్టింగ్ బ్రిడ్జి, కిస్మత్ పురా రోడ్ నుంచి బండ్లగూడ జాగీర్ కనెక్టింగ్ బ్రిడ్జి, మూసారాంబాగ్ వద్ద కనెక్టింగ్ బ్రిడ్జి, చాదర్ ఘాట్ వద్ద కనెక్టింగ్ బ్రిడ్జి, అత్తాపూర్ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జి, ఉప్పల్ లే అవుట్ నుంచి సౌత్ బ్యాంక్ కనెక్టింగ్ బ్రిడ్జి, మంచిరేవుల నుంచి నార్సింగి కనెక్టింగ్ బ్రిడ్జి, బుద్వేల్ ఐటీ పార్కు కనెక్టింగ్ రోడ్ల బ్రిడ్జి, హైదర్​ షాకోట్ నుంచి రాందేవ్ గూడ కనెక్టింగ్ బ్రిడ్జి, బుద్వేల్ ఐటీ పార్కు కనెక్టింగ్ రోడ్లకు బ్రిడ్జి, ప్రతాప్ సింగారం నుంచి గౌరెల్లికి కనెక్టింగ్ బ్రిడ్జి, మంచిరేవుల బ్రిడ్జికి కొత్త లింక్ రోడ్లను నిర్మించాలని ప్రపోజల్స్ ​ఉన్నాయి. కానీ భూ సేకరణ జరగకపోవడంతో పనులు మొదలు ​కావడం లేదు.