మానేరు వాగు మీద చెక్​ డ్యాంల నిర్మాణం పూర్తి కాలేదు

మానేరు వాగు మీద చెక్​ డ్యాంల నిర్మాణం పూర్తి కాలేదు
  • మానేరులో రూ. వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడ్డరు
  • అధికార పార్టీ అండతోనే అక్రమాలు
  • మానేరు పరిరక్షణ సమితి నాయకుల ఆరోపణ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మానేరు వాగులో ఇంకా చెక్ డ్యాంల నిర్మాణమే పూర్తికానప్పటికీ అందులో డీ సిల్టేషన్​పేరుతో ఇసుక తవ్వకాలకు పర్మిషన్​ ఇచ్చారని, తద్వారా రూలింగ్​పార్టీ లీడర్లు, ఆఫీసర్లు కలిసి వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని మానేరు పరిరక్షణ సమితి నాయకులు గొట్టిముక్కుల సురేష్​రెడ్డి, అంబటి కరుణాకర్​రెడ్డి ఆరోపించారు.  ఓదెల మండలం మడక, కనగర్తి ఇసుక రీచ్​లను  మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సురేష్​రెడ్డి, కరుణాకర్​రెడ్డి మాట్లాడుతూ మానేరు వాగు మీద చెక్​ డ్యాంల నిర్మాణం కోసం నాబార్డు నిధులు మంజూరైనా ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తి కాలేదన్నారు. కానీ వాగులో 24 చెక్​డ్యాంల నిర్మాణం పూర్తయినట్లు ఇరిగేషన్​ ఆఫీసర్లు  తప్పుడు రిపోర్టులు ఇచ్చారని చెప్పారు. తాము  ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరిస్తే ఇప్పటివరకు ఒక్కటి కూడా  పూర్తికాలేదనే సమాచారం వచ్చిందన్నారు. చెక్​ డ్యాంలు లేకపోయినా అందులో ఇసుక మేటలు వేసినట్లు చూసి, పూడిక తీత  పేరుతో ప్రభుత్వం ఏకంగా 19 ఇసుక రీచ్​లకు పర్మిషన్లు ఇచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో ఆఫీసర్లు ఇచ్చిన తప్పుడు రిపోర్టులతో కలెక్టర్​ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డిస్ట్రిక్ట్​ లెవల్​సాండ్​ కమిటీ పాత్ర  నామమాత్రమే అయిందన్నారు.  ఇసుక రీచ్​లకు అనుమతుల వల్ల ప్రభుత్వానికి రూ. 100 కోట్లు  రాగా, కాంట్రాక్టర్లు మాత్రం అంతకు 10 రెట్లు ఇసుక తోడుకుపోతున్నారని సురేష్​రెడ్డి, కరుణాకర్​రెడ్డి ఆరోపించారు. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 1000 కోట్ల దాకా లాస్​వచ్చిందన్నారు. తెలంగాణ స్టేట్​ మినరల్​ డెవలప్​మెంట్​(​టీఎస్​ ఎండీసీ) నిబంధనలేవీ పాటించడం లేదని,  2.5 మీటర్ల లోతు వరకే ఇసుక  తీయాల్సి ఉండగా 4 మీటర్ల వరకు తోడడంతో వాగంతా కయ్యలు పడిందన్నారు. ఈ దందా వెనుక  అధికారపార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుయాయులే ఉన్నారని, అందువల్లే  పోలీస్​స్టేషన్లలో,  తహసీల్దార్ ఆఫీసుల్లో​, ఆర్డీఓకు, కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకుంటలేరన్నారు. ముందు హడావుడి చేసిన  మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఇప్పుడెందుకు సైలెంట్​ అయ్యారని ప్రశ్నించారు. తమ వద్ద ఇసుక రీచ్​ల అక్రమ అనుమతులకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని, దీనిపై  గ్రీన్​ ట్రిబ్యునల్​లో కంప్లైంట్​ చేయడంతో పాటు,  సమీప గ్రామ ప్రజలందరితో కలిసి  కోర్టులో పిల్​ వేస్తామన్నారు. వారి వెంట ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.