డబుల్ బెడ్ రూమ్స్​ ఇండ్లను ఆక్రమించుకున్రు!

డబుల్ బెడ్ రూమ్స్​ ఇండ్లను ఆక్రమించుకున్రు!
  • కొండపాక మండలం విశ్వనాథపల్లిలో 50 ఇండ్ల నిర్మాణం
  •     ఏండ్లు గడుస్తున్నా పంపిణీ చేయకపోవడంతో ఆక్రమించుకున్న లబ్ధిదారులు
  •     మిగతా వాళ్లు ప్రభుత్వ ఖాళీ స్థలంలో, సీసీ రోడ్ల పైనే చేపట్టిన నిర్మాణాలు 
  •     ఆలస్యంగా మేల్కొన్న ఆఫీసర్లు.. అక్రమ కట్టడాల కూల్చివేత 
  •     సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని పరిస్థితి ఇదీ.. 

సిద్దిపేట, వెలుగు : నాలుగేండ్ల కింద కొండపాక మండలం  వెలికట్టె గ్రామానికి 77 డబుల్​ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయి. కాగా, ఇదే  గ్రామ పంచాయతీ పరిధిలో  రవీంద్రనగర్, విశ్వనాథపల్లి మధిర గ్రామాలుగా ఉండేవి. మంజూరైన ఇండ్లను వెలికట్టె శివారులో 27, విశ్వనాథపల్లి శివారులో 50 ఇండ్ల ను నిర్మించారు. మూడేండ్ల కింద విశ్వనాథపల్లి కొత్త  గ్రామ పంచాయతీగా ఏర్పడగా, రవీంద్రనగర్ దాని మధిర గ్రామంగా ఉంది.  విశ్వనాథపల్లి గ్రామ శివారులో  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయడంలో జాప్యం జరిగింది. 

ఇండ్లను ఆక్రమించుకున్రు.. 

విశ్వనాథపల్లి శివారులో 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తై ఏండ్లు గడుస్తున్నా పంపిణీ చేయకపోవడంతో ఇటీవల గ్రామానికి చెందిన కొందరు ఇండ్లలోకి ప్రవేశించి నివాసం ఉంటున్నారు. గ్రామంలో మొత్తం 65 మంది అర్హులు కాగా, 50 మందికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లభించాయి. దీంతో ఆ కుటుంబాల మధ్య గొడవ జరగడంతో  రాజీ మార్గంగా మిగతావారు కాలనీలో పార్కుల కోసం వదిలిన స్థలాల్లో, సీసీ రోడ్లపై ఇండ్ల నిర్మాణం చేసుకోవాలని వారిలోవారే ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడి ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. కాగా, ఈ విషయంలో ఆలస్యంగా మేల్కొన్న ఆఫీసర్లు శనివారం కాలనీలో కట్టుకున్న ఇండ్లను  కూల్చి వేశారు. 

అర్హులైనవారికి సహాయం చేస్తాం 

విశ్వనాథపల్లిలో డబుల్​ బెడ్​ రూమ్స్​కు అర్హులై ఉండి ఇండ్లు లభించని వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల ఆర్థిక సహాయం చేస్తాం. డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఖాళీ స్థలాలు, సీసీ రోడ్లపై అక్రమంగా నిర్మిస్తున్న ఇండ్లను కూల్చివేస్తాం. ఇప్పటికే ఈ విషయమై కొండపాక తహసీల్దారుకు ఆదేశాలు ఇచ్చాం.  
 -  విజయేందర్ రెడ్డి,  ఆర్డీవో, గజ్వేల్

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథపల్లిలో డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల లొల్లి రాజుకుంటోంది. లబ్ధిదారులు ఎక్కువ.. కట్టిన ఇండ్లు తక్కువ కావడం సమస్యగా మారింది. నిర్మాణం పూర్తై ఏండ్లు గడుస్తున్నా పంపిణీ చేయకపోవడంతో కట్టిన ఇండ్లను ఇటీవల కొందరు లబ్ధిదారులు ఆక్రమించుకున్నారు. మిగతావారు అక్కడే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో, సీసీ రోడ్లపై సొంతంగా ఇండ్లు నిర్మించుకుంటున్నారు. ఆలస్యంగా మేల్కొన్న అధికారులు అక్రమ కట్టడాలను శనివారం కూల్చివేశారు. ఇదీ.. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని డబుల్​ బెడ్ ​రూమ్ ​ఇండ్ల పరిస్థితి...