నాలుగేళ్లయినా పూర్తికాని నిర్మాణం 

నాలుగేళ్లయినా పూర్తికాని నిర్మాణం 

మెదక్​/తూప్రాన్/మనోహరాబాద్, వెలుగు: మనోహరాబాద్ మండలం రామాయిపల్లి వద్ద నేషనల్ హైవే–44 పై చేపట్టిన హైలెవల్​ బ్రిడ్జి నిర్మాణ పనులు నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. రైల్వే లైన్ పనులు పూర్తయి, చాలా రోజులవుతున్నా, బ్రిడ్జి నిర్మాణం ఇంకా అసంపూర్తిగానే ఉంది. దీంతో వర్షం పడినప్పుడల్లా వెహకల్స్​రాకపోకల కోసం టెంపరరీగా నిర్మించిన అండర్ పాస్ లోకి భారీగా వరద నీరు చేరి హైవే మీద కిలోమీటర్ల మేర, గంటల తరబడి ట్రాఫిక్ జామ్​ అయ్యి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. 

32 కిలోమీటర్ల  రైల్వే లైన్​..

సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు రైలు సౌకర్యం కల్పించేందుకు మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిరిసిల్ల  జిల్లాలోని కొత్తపల్లి వరకు కొత్త  రైల్వే లైన్​ శాంక్షన్​ అయ్యింది. ఈ ప్రాజెక్ట్​లో భాగంగా ఫస్ట్​ఫేజ్​లో మనోహరాబాద్  నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ వరకు 32 కిలోమీటర్ల దూరం రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు. కాగా రైల్వే లైన్ నిర్మించే రూట్ లో రామాయిపల్లి వద్ద నేషనల్ హైవే –44 అడ్డుగా ఉంది. దేశంలోనే అతి పొడవైన ఈ హైవే మీద నిత్యం వేల సంఖ్యలో వెహికల్స్ రాకపోకలు సాగిస్తుంటాయి. అంతేగాక హైవే కావడం వల్ల వెహికల్స్​ చాలా స్పీడ్​గా వెళ్తుంటాయి. ఈ క్రమంలో రామాయిపల్లి వద్ద రైల్వే ట్రాక్ నిర్మించే చోట నేషనల్ హైవే మీద హైలెవల్ బ్రిడ్జిని నిర్మించేందుకు  ప్లాన్  చేశారు. 

రూ.100 కోట్లతో..  

బ్రిడ్జి నిర్మాణం కోసం 2017లో కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. 2018లో మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త  ప్రభాకర్ రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా రైల్వే ట్రాక్​ నిర్మించిన తరువాత దానిపై నుంచి హైలెవల్​ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. కాగా హైవే మీద వెహికల్స్​రాకపోకలకు ఇబ్బంది కలగకుండా హైవే రోడ్డుకు ఇరు పక్కలా తాత్కాలికంగా అండర్ పాస్ నిర్మాణం చేపట్టారు.  అండర్​ పాస్​ పని పూర్తయ్యాక వెహికల్స్​ను అందులో నుంచి పంపిస్తూ,  హైవేపై నుంచి అడ్డంగా బ్రాడ్​గేజ్​ రైల్వే లైన్​ నిర్మాణం చేపట్టారు. 

ప్లానింగ్​ సరిగా లేక..

 సరైన ప్లానింగ్ లేకపోవడంతో వర్షం పడిన ప్రతిసారి వరద  నీరు అండర్ పాస్ లోకి చేరి  వెహికల్స్​రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  రామాయిపల్లి పరిసర ప్రాంతాల్లోని  వరద నీటిని మళ్లించే ఏర్పాటు చేయకపోవడంతో నీళ్లన్నీ అండర్​ పాస్​లోకి వచ్చి చేరుతున్నాయి.  వెహికల్స్​వెళ్లలేని పరిస్థితి ఏర్పడి, హైవే మీద ఇరు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్​అవుతోంది. ఒక్కోసారి బైక్​లు, కార్లు మునిగి పోయేంత నీరు చేరుతోంది. గత మూడేళ్లుగా ఏటా ఇదే సమస్య ఎదురవుతోంది. వర్ష తీవ్రతను బట్టి 2 నుంచి -3  గంటలు,  ఒక్కో సారి10 నుంచి -12 గంటల వరకు ట్రాఫిక్​ స్తంభిస్తోంది. 5 నుంచి 10 కిలోమీటర్ల మేర వేల సంఖ్యలో వెహికల్స్​రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. 

స్లోగా పనులు.. 

నేషనల్ హైవే మీద ఉన్న రైల్వే ట్రాక్ పై నుంచి నిర్మించాల్సిన హైలెవల్ బ్రిడ్జి  పనులు డెడ్​ స్లోగా జరుగుతున్నాయి. ఆ పని పూర్తయ్యేందుకు ఇంకా చాలా రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ బ్రిడ్జి పూర్తయితే గానీ  హైవే మీద రాకపోకలకు ఇబ్బందులు తొలిగిపోవు. అండర్ పాస్ తో ఇబ్బందులు ఎదురవుతుండడంతో  హైలెవల్  బ్రిడ్జి నిర్మాణం పనులు స్పీడప్​ చేసి వీలైనంత  త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

వానపడ్డప్పుడల్లా తిప్పలే..

పెద్దవాన పడితే  అండర్​పాస్​లో నీళ్లు నిండుతున్నయ్. బైక్​లు, కార్లు నీళ్లలో మునిగిపోతున్నయ్. ఏ వెహికల్స్​పోయే పరిస్థితి లేక రాకపోకలకు మస్తు తిప్పలైతోంది. ఎవరికైనా అనారోగ్య సమస్యలు, యాక్సిడెంట్లు అయితే ట్రీట్​మెంట్​కోసం ఎమర్జెన్సీగా హైదరాబాద్​వెళ్లాలంటే ఇబ్బంది అవుతోంది.  హైలెవెల్​బ్రిడ్జి నిర్మాణం జల్ది  పూర్తి చేపియ్యాలె. 

 - రంజిత్​రెడ్డి, తూప్రాన్