పూర్తికాని సదర్మాట్.. ఈ సారీ నిరాశే !

పూర్తికాని సదర్మాట్.. ఈ సారీ నిరాశే !
  • గడువు ముగిసినా పెండింగ్‌లోనే బ్యారేజీ పనులు
  • నిధుల విడుదలలో జాప్యం చేస్తున్న సర్కార్
  • వర్షాలు ప్రారంభం కావడంతో నిలిచిపోనున్న పనులు
  • ముంపు రైతులకు నేటికీ అందని పరిహారం

నిర్మల్, వెలుగు : వేలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కావడం లేదు. దీంతో ఈ సీజన్ లో కూడా సాగు నీరు అందడం కష్టంగానే మారింది. బ్యారేజీ పనులను గతేడాదే పూర్తి చేయాల్సి ఉన్నా వరదలు రావడానికి తోడు సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. దీంతో గడువును మరో ఏడాది పొడిగించారు. ఈ గడువు కూడా గత నెలతోనే ముగిసింది. అయినా ఇంకా 30 శాతం పనులు పెండింగ్ లోనే ఉన్నాయి.

ఐదేళ్ల కింద ప్రారంభమైన పనులు

నిర్మల్ జిల్లాలో 13,020 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 4,896 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో గోదావరి నదిపై సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. 1.58 టీఎంసీల కెపాసిటీతో, 55 గేట్లతో బ్యారేజీని నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 597 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు రూ. 488.35 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో భూ సేకరణకు రూ. 109 కోట్లు ఖర్చు చేశారు. ఐదేళ్ల కింద ప్రారంభమైన ఈ పనులు గతేడాదే పూర్తి చేయాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో పనులు ఆలస్యంగా జరగడంతో గడువును మరో ఏడాది పొడిగించారు.

వరద పెరిగితే ఆగిపోనున్న పనులు 

బ్యారేజీ నిర్మాణంలో భాగంగా ఆరేడు నెలల నుంచి గేట్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. అయితే నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయడంతో పనులు స్లోగా నడుస్తున్నాయి. అయితే ఇప్పటికే వర్షాలు పడుతున్నందున గోదావరి నదిలో వరద ప్రవాహం పెరిగే చాన్స్ ఉంది. పనులు చేపట్టడం సాధ్యం కాదని ఆఫీసర్లు అంటున్నారు. దీంతో ఈ సారి బ్యారేజీ పూర్తవుతుందని, సాగుకు నీళ్లు అందుతాయని ఆశించిన నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రైతులకు నిరాశ తప్పడం లేదు. బ్యారేజీ పూర్తయ్ర్తై సాగునీరు అందాలంటే మరో ఏడాది ఆగక తప్పదని రైతులు వాపోతున్నారు. 

పూర్తి స్థాయిలో అందని పరిహారం

సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం  కోసం మొత్తం 1,176 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. ఈ భూములకు పరిహారం చెల్లించే విషయంలో మొదటి నుంచి రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పాత పద్ధతిలోనే పరిహారం ఇస్తామని స్పష్టం చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన సర్కార్ ఎట్టకేలకు ఆర్ అండ్ ఆర్ యాక్ట్ ప్రకారమే రైతులకు పరిహారం ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 597 కోట్లు కాగా ఇందులో రూ. 109 కోట్లను భూసేకరణకు కేటాయించారు. అయితే రైతుల నుంచి సేకరించిన 1,176 ఎకరాల్లో 1,035 ఎకరాలకు మాత్రమే పరిహారం ఇచ్చారు. మిగిలిన 140 ఎకరాలకు డబ్బులు పంపిణీ చేయాల్సి ఉంది. నిర్మల్ జిల్లాలో 85 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 55 ఎకరాలకు సంబంధించిన పరిహారం పెండింగ్ లో ఉంది. అయితే నిధుల కొరత కారణంగానే రైతులకు పరిహారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. +

వరదలతోనే ఆలస్యం  

గత రెండేళ్ల నుంచి వరుసగా వరదలు రావడంతో సదర్మాట్ బ్యారేజీ పనులు ఆలస్యం అవుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజీకి సంబంధించిన గేట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గోదావరి నది ప్రవాహ తీవ్రత కారణంగా పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయాం. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. రాబోయే ఖరీఫ్ నాటికి పనులను పూర్తి చేసి నిర్మల్, జగిత్యాల  జిల్లాల్లోని రైతులకు సాగునీరు అందిస్తాం.

- సురేందర్ రాథోడ్, డీఈ, సదర్మాట్ బ్యారేజీ