
- పనులు ప్రారంభించి రెండేళ్లు దాటినా పూర్తి కాని బ్రిడ్జి నిర్మాణం
- స్ట్రక్చరల్ డిజైన్స్, డ్రాయింగ్ ఇవ్వడంలో రైల్వే శాఖ జాప్యం
- రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లేనని బీజేపీ నేతల ఆరోపణ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగుతూ సాగుతున్నాయి. ఆర్వోబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి రెండేళ్లయినా పిల్లర్ల దశలోనే ఉండిపోయాయి. రైల్వే ట్రాక్ మీదుగా వెళ్లే బ్రిడ్జి స్ట్రక్చరల్ డిజైన్స్, డ్రాయింగ్ ఫైనల్ చేసి ఇవ్వడంలో రైల్వే శాఖ జాప్యం చేయడంతోనే మిగతా పనులు ఆలస్యమైనట్లు తెలిసింది. మార్చి వరకు డిజైన్లు ఇవ్వకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుండగా.. బీజేపీ నాయకులు మాత్రం ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కరీంనగర్- మంచిర్యాల రహదారిలో రోజూ రాకపోకలు సాగించే వేలాది మంది వాహనదారులు రైల్వే గేటు పడిందంటే చుక్కలు చూస్తున్నారు. ఎమర్జెన్సీగా పేషెంట్లను తీసుకెళ్లే అంబులెన్స్ లు సైతం గేటు పడిందంటే ఆగిపోవడం, ఆలస్యమైన కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోవడం జరుగుతూనే ఉంది. రోజులో 15 నుంచి 20 సార్లు గేట్ పడుతుండగా.. పడినప్పుడల్లా సుమారు 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతోంది. ఆదివారం రైల్వే గేట్ వద్ద బారికేడ్ తగిలి లారీ రైల్వే ట్రాక్ పై నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. హుటాహుటిన జేసీబీని తీసుకొచ్చి బారికేడ్ ను పైకి లేపడంతో లారీ ముందుకు
కదిలింది.
స్ట్రక్చరల్ డిజైన్స్, డ్రాయింగ్ ఇవ్వడంలో రైల్వే శాఖ జాప్యం
కేంద్ర ప్రభుత్వం సేతు బంధన్ స్కీమ్ కింద కరీంనగర్ - చొప్పదండి మధ్యలో ఉన్న రైల్వే గేట్ మీదుగా రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు రూ.128 కోట్లు ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.28 కోట్లు కేటాయించింది. మొత్తంగా రూ.156 కోట్లు మంజూరు చేసింది. గత సర్కార్ హయాంలో 2023 జూలై 18న అప్పటి మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాలుగు లేన్లలో 750 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంది.
ఇప్పటి వరకు నాలుగు లైన్లలో రెండు లైన్లకు సంబంధించి ఇరు వైపులా భారీ పిల్లర్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ పిల్లర్లను అనుసంధానిస్తూ స్లాబ్ వేయాల్సి ఉంది. రైల్వే ట్రాక్ మీదుగా నిర్మించే ఈ స్లాబ్ విషయంలో స్ట్రక్చరల్ డిజైన్స్, డ్రాయింగ్ ను కాంట్రాక్టర్ కు రైల్వే శాఖ ఈ ఏడాది మార్చి వరకు ఇవ్వలేదని తెలిసింది. అందుకే కాంట్రాక్టర్ పనులు చేయలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే డిజైన్లు అందాక గతంలో ఉన్న రైల్వే గేటు రోడ్డును మూసి వేసి.. పక్కన కొద్ది దూరం నుంచి వాహనాల రాకపోకలను మళ్లించారు.
రాజకీయ దుమారం రేపుతున్న ఆర్వోబీ వ్యవహారం
ఆర్వోబీ పనులను గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రెండుసార్లు సందర్శించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ ఆఫీసర్లు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అయినా పనుల్లో పెద్దగా పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు సూచనతో ఆయన అనుచరులు ఇటీవల వాట్సప్ గ్రూప్ ద్వారా మరోసారి ఆర్వోబీ నిర్మాణంలో జాప్యంపై చర్చను తెరమీదికి తీసుకొచ్చారు. దీంతో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు పోటాపోటీగా ఆర్వోబీ వద్దకు వెళ్లడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది.
ఆర్వోబీ అందుబాటులోకి వస్తే ప్రజలకు మేలు..
రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు రైల్వే, ఆర్ అండ్ బీ ఆఫీసర్లను కలిసి మాట్లాడుతున్నం. త్వరలో ఆయా శాఖల ఆఫీసర్లను ఆహ్వానించి కరీంనగర్ లో సమావేశం నిర్వహిస్తాం. ఈ విషయంలో రాజకీయాలు అవసరం లేదు. ఆర్వోబీ పూర్తయి త్వరగా అందుబాటులోకి వస్తే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఇందుకోసం మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారం తీసుకుంటాం. - వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ చార్జి