ఆఫీసర్ల కంట్రోల్ లో కంటైన్మెంట్ జోన్లు

ఆఫీసర్ల కంట్రోల్ లో కంటైన్మెంట్ జోన్లు

కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్ ఏరియాలు పూర్తిగా ఆఫీసర్ల కంట్రోల్లో ఉన్నాయి. ఆయా ఏరియాల్లోని ప్రజలు నిత్యావసర సరుకులకు కూడా బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. వారికి అవసరమైన సరుకుల సరఫరా కోసం అధికార యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ వ్యవస్థ సక్రమంగా జరిగేలా కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టిసారించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు సరాఫరా చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 67 కేసులు

ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కు చేరింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 19 ఏరియాలను కంటైన్మెంట్ గా ప్రకటించింది. నిజామాబాద్ జిల్లాలో 55 పాజిటివ్ కేసులు ఉండగా కంటైన్మెంట్ ఏరియాలు 15 ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 12 కేసులు నమోదు కాగా 4 కంటైన్మెంట్ఏరియాలు ఉన్నాయి. ఇందులో బాన్సువాడలోనే 11 కేసులు ఉండగా ఇక్కడే మూడు కాలనీలను కంటైన్మెంట్ ఏరియాలు ఆఫీసర్లు ప్రకటించారు.

నిత్యావసర సరుకుల సరఫరా

లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ నిత్యావసర సరుకులు, కూరగాయలు తెచ్చుకోవటానికి ఇతర ప్రాంతాల్లో కొన్ని గంటలు అనుమతి ఇచ్చారు. కేసుల నమోదు పెరుగుదల ప్రకారం ఆఫీసర్లు కంటైన్మెంట్, నో మూమెంట్, రెడ్ జోన్లుగా ప్రకటిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కంటైన్మెంట్ ఏరియాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడి జనాలు బయటకు వెళ్లటానికి వీలులేదు. వారి అవసరాల కోసం ఆఫీసర్లు స్పెషల్గా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. రోజూ నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యక్తుల ద్వారా సరాఫరా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని వారికి కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు ఇచ్చారు. హెల్త్, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, సిబ్బందితో స్పెషల్గా టీమ్లు ఏర్పాటు చేసి కంటైన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో…

నిజామాబాద్ జిల్లాలో కేసులు అధికంగా నగరంలోనే ఉన్నాయి. వీటితోపాటు బోధన్, మాక్లుర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్ గల్ లోనూ ఉన్నాయి. నగరంలో కంటైన్మైంట్ ఏరియాలుగా గుర్తించిన చోట ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. ఇక్కడ నిత్యావసర వస్తువుల సరాఫరా కోసం కొన్ని షాపులను స్పెషల్గా గుర్తించారు. సంబంధిత షాపుల ఫోన్ నంబర్లు ప్రజలకు తెలియజేశారు. జనం తమకు అవసరమైన వస్తువుల కోసం ఫోన్ చేయగానే స్పెషల్గా ఏర్పాటు చేసిన వ్యక్తుల ద్వారా అందజేస్తున్నారు. జనం బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లాలో…

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఆఫీసర్లు ఆటోల ద్వారా సరుకుల సరాఫరాకు ఏర్పాట్లు చేశారు. రోజువారీగా అవసరమైన సరుకులతోరూ.500, రూ.వెయ్యి కిట్లను ఏర్పాటు చేసి నేరుగా ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి టౌన్లలో ఈ ఏర్పాట్లు చేశారు. బాన్సువాడలో టీచర్స్ కాలనీ, అర్ఫాత్ కాలనీ, మదీనకాలనీలను కంటైన్మెంట్ ఏరియాలుగా ప్రకటించగా ఆటోల ద్వారా నిత్యావసర వస్తువులు సరాఫరా చేస్తున్నారు.