బీఆర్ఎస్​లో ఉండాలా? వీడాలా?.. అనుచరులతో మైనంపల్లి

బీఆర్ఎస్​లో ఉండాలా? వీడాలా?.. అనుచరులతో మైనంపల్లి
  • ఇయ్యాల అభిమానులతో మైనంపల్లి భేటీ

హైదరాబాద్, వెలుగు: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గులాబీ పార్టీలోనే కొనసాగుతారా.. లేదా అనేది శనివారం తేలిపోనుంది. ఇటీవల తిరుమలలో హరీశ్​రావుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా ఆయనకు పార్టీ హైకమాండ్ మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్​ఇచ్చింది. ఆ తర్వాతి రోజు కూడా హరీశ్​రావుపై ఆరోపణలు చేశారు. తాను పార్టీపై, కేసీఆర్​పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేసీఆర్ కూడా తన గురించి ఏమి మాట్లాడలేదన్నారు. హైదరాబాద్​కు తిరిగి వచ్చిన ఆయన శనివారం దూలపల్లిలోని తన నివాసంలో అనుచరులతో సమావేశమవుతున్నారు. 

నియోజకవర్గంలోని అన్ని డివిజన్​ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ​సీనియర్ ​లీడర్లు, అన్ని సర్కిళ్ల కమిటీ మెంబర్లు మిగతా నాయకులంతా అటెండ్​ కావాలని సమాచారం ఇచ్చారు. మల్కాజిగిరి టికెట్ తనకు ఖరారు చేయగా మెదక్​టికెట్​తన కుమారుడు రోహిత్​కు ఇవ్వాలని మైనంపల్లి కోరుతున్నారు. ఇటీవల కేసీఆర్​మెదక్​జిల్లా పర్యటనలో అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి పద్మా దేవేందర్​రెడ్డిని గెలిపించే బాధ్యత మంత్రి హరీశ్​రావుకు అప్పగించారు. దీంతో రోహిత్​కు టికెట్​ఇచ్చే అవకాశం లేదని తేలిపోయింది. మైనంపల్లి బీఆర్ఎస్​లోనే కొనసాగుతారా, పార్టీని వీడుతారా అనేది తేలిపోనుంది.