ముంబై: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. ఫెడ్ మీటింగ్‌కి ముందు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కి మొగ్గు చూపడంతో మంగళవారం (డిసెంబర్ 09) సెషన్‌లో రెడ్‌లో కదిలాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 436 పాయింట్లు (0.51శాతం) పడిపోయి 84,666.28 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 719 పాయింట్లు పతనమై 84,382.96 కనిష్టాన్ని తాకింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 121 పాయింట్లు (0.47శాతం) తగ్గి 25,839.65 వద్ద సెటిలయ్యింది. విదేశీ పెట్టుబడులు వెళ్లిపోతుండడం, గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో కదలడం, యూఎస్ ఫెడ్ నిర్ణయం ముందు ప్రాఫిట్ బుకింగ్కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో మార్కెట్ పడుతోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. యూఎస్ ఫెడ్ రెండు రోజుల సమావేశం ప్రారంభించగా, బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీని కఠినం చేస్తుందనే అంచనాలతో గ్లోబల్ సెంటిమెంట్ దెబ్బతింది.
ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సోమవారం నికరంగా రూ.655.59 కోట్ల షేర్లు విక్రయించగా, మంగళవారం సెషన్‌లో మరో రూ.3,700 కోట్ల షేర్లు అమ్మారు. డాలర్‌తో రూపాయి విలువ 17 పైసలు బలపడి 89.88 వద్ద సెటిలయ్యింది. రూపాయి కిందటి వారం 90.40 వరకు పడి ఆల్ టైమ్ కనిష్టానికి చేరిన విషయం తెలిసిందే.

