ముసురుతో ‘పత్తి’కి ముప్పు.. ఉమ్మడి జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో పంట సాగు

ముసురుతో ‘పత్తి’కి ముప్పు.. ఉమ్మడి జిల్లాలో  7 లక్షల ఎకరాల్లో పంట సాగు
  • కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షం
  • ఆందోళనలో రైతులు

వనపర్తి, వెలుగు : ముసురు వానతో పత్తి పంటకు ముప్పు పొంచి ఉన్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పత్తి పంటలో పూత రాలిపోతోంది. దీంతో పత్తి సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. పంట దెబ్బతినడంతో రైతన్నలు లబోదిబో మంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసినట్లు అధికారులు తెలిపారు. రంగు మారిన పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు. 

తగ్గుతున్న దిగుబడి..

వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఒక ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పత్తి దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు వేర్ల ద్వారా పోషకాలు అందక ఆకులు పసుపు, ఎరుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయి. పూత కూడా రాలుతుండడంతోపాటు కాత నిలిచిపోయింది. 

ఒక ఎకర పత్తి పంట సాగుకు రూ.30 వేల వరకు ఖర్చు వస్తుంది. ఎకరానికి కనీసం 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చి.. మద్దతు ధర క్వింటాల్ రూ.8110 పలికితే రైతుకు లాభం వస్తుంది. కానీ పత్తి తడిసి రంగు మారి దిగుబడి తగ్గితే అందులో సగం వరకు వచ్చే అవకాశం ఉంటుందని రైతులు వాపోతున్నారు. వనపర్తి జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇక్కడి రైతులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది. దీనికి తోడు పత్తి వ్యాపారులు జిల్లాలో పత్తి పండే గ్రామాలకే వెళ్లి అక్కడే కాంటాలు పెట్టి మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తారు. గత్యంతరం లేక రైతులు గ్రామాలకు వచ్చే వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. 

ఉమ్మడి జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో పత్తి సాగు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. నాగర్​కర్నూలు జిల్లాలో ఎక్కువ పత్తి సాగవుతోంది. ఇక్కడ 2.03 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. తరువాత జోగులాంబ గద్వాల జిల్లాలో 1.87 లక్షలు, నారాయణపేటలో 1.63 లక్షలు, మహబూబ్​నగర్​లో 82 వేలు, వనపర్తి జిల్లాలో 15,801 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు.