డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకు మూడు నెలలుగా జీతాల్లేవ్

డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకు మూడు నెలలుగా జీతాల్లేవ్
  • రెన్యువల్ చేయకుండా సతాయిస్తున్న ఫైనాన్స్ శాఖ 

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు అధికారుల నిర్లక్ష్యంతో సకాలంలో జీతాలు అందడం లేదు. వారిని రెన్యువల్ చేయకపోవడంతో, మూడు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 121 సర్కారు డిగ్రీ కాలేజీల్లో 459 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. గతంలో ఎక్కువ మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నా.. రెండేండ్ల కింద చాలా మందిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. కొందరికి అర్హతలు లేకపోవడంతో వాళ్లు రెగ్యులర్ కాలేదు. ప్రస్తుతం హైకోర్టు తీర్పు నేపథ్యంలో అర్హతలు సాధించినా.. క్రమబద్ధీకరణ సాధ్యం కావడం లేదు. 

అయితే, కాంట్రాక్టు లెక్చరర్లు ఏటా రెన్యువల్ అవుతుంటారు. కానీ 2025–26 విద్యా సంవత్సరంలో మాత్రం ఇప్పటికీ వారు రెన్యువల్‌‌ కాలేదు. దీంతో ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు అందలేదు. రెన్యువల్ కోసం కళాశాల విద్యా శాఖ అధికారులు రెండు నెలల క్రితమే ఫైనాన్స్ అధికారులకు వివరాలు పంపినా, ఇప్పటికీ రెన్యువల్ జీవో రిలీజ్ చేయలేదు. మరోపక్క కాలేజీల్లో ఔట్ సోర్సింగ్ కింద పనిచేసే 340 మంది రికార్డు అసిస్టెంట్లు, స్పీపర్లు, అటెండర్లనూ రెన్యువల్ చేయలేదు. కాలేజీలు ప్రారంభమైనా హవర్లీ బెస్డ్ టీచరపై ఫైనాన్స్ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టు లెక్చరర్లను రెన్యువల్ చేసి, పెండింగ్ వేతనాలు రిలీజ్ చేయాలని టీజీడీసీఎల్‌‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.