బిల్లుల విషయంలో గొడవ.. భూపాలపల్లి కలెక్టరేట్‌‌లోని కొట్టుకున్న కాంట్రాక్టర్‌‌, ఆఫీసర్‌‌

బిల్లుల విషయంలో గొడవ.. భూపాలపల్లి కలెక్టరేట్‌‌లోని కొట్టుకున్న కాంట్రాక్టర్‌‌, ఆఫీసర్‌‌

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: బిల్లుల చెల్లింపు విషయంలో ఓ కాంట్రాక్టర్, ఆఫీసర్‌‌ మధ్య తలెత్తిన గొడవ చివరకు పరస్పరం కొట్టుకునే వరకు వెళ్లింది. భూపాలపల్లి కలెక్టరేట్‌‌లోని పే అండ్‌‌ అకౌంట్స్‌‌ ఆఫీస్‌‌లో గురువారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన కాంట్రాక్టర్‌‌ సూరం వీరేందర్‌‌ గతంలో పలు పనులు చేపట్టాడు. వీటికి సంబంధించి రూ. 23 లక్షలు రావాల్సి ఉండడంతో గురువారం కలెక్టరేట్‌‌లోని పే అండ్‌‌ అకౌంట్స్‌‌ సెక్షన్‌‌కు వెళ్లి ఆఫీసర్​ఫణి భూషణ్‌‌ను కలిశాడు.

 బిల్లులు చెల్లించేందుకు నిధులు లేవని ఆఫీసర్‌‌ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. ఆఫీసర్‌‌ ఫణిభూషణ్‌‌ తన టేబుల్ మీద ఉన్న కాలింగ్‌‌ బెల్‌‌తో దాడి చేయడంతో తనకు గాయాలు అయ్యాయని కాంట్రాక్టర్‌‌  వీరేందర్ భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.