మెదక్ జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ముందుకు రాని కాంట్రాక్టర్లు..రెండు సార్లు టెండర్లు పిలిచినా ఒక్కటీ పడలేదు

మెదక్ జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ముందుకు రాని కాంట్రాక్టర్లు..రెండు సార్లు టెండర్లు పిలిచినా ఒక్కటీ పడలేదు
  • అదను దాటిపోతోందని మత్స్యకారుల ఆందోళన
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విన్నపాలు

మెదక్/నిజాంపేట, వెలుగు: ఈ సీజన్​లో  వర్షాలు బాగా పడడంతో చెరువులు పూర్తిగా నిండి చేపల పెంపకానికి అనువైన వాతావరణం ఏర్పడింది. కానీ చేప పిల్లల పంపిణీకి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మత్స్యకారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా చేపల పెంపకం చేపట్టే చెరువులు మొత్తం 1,718 ఉన్నాయి. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 309 మత్స్య సహకార సంఘాలు ఉండగా వాటిల్లో మొత్తం16,820 మంది సభ్యులు ఉన్నారు.

 ఆయా సొసైటీల ఆధ్వర్యంలో చెరువుల్లో చేపల పెంపకం చేపడతారు. ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కింద ఈ సీజన్ లో 5.30 కోట్ల చేప పిల్లలు విడుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఫిషరీస్ డిపార్ట్ మెంట్ అధికారులు ఇప్పటి వరకు రెండు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదు.  

అదను దాటి పోతోందని ఆందోళన..

జులై, ఆగస్టులో చెరువుల్లో చేప పిల్లలను వదిలితే బాగా పెరుగుతాయి. ఈ సారి ఆగస్ట్​లో సమృద్ధిగా వర్షాలు కురిసి జిల్లా వ్యాప్తంగా చెరువులన్నీ పూర్తిగా నిండాయి. దీంతో చేపల పెంపకానికి అనువైన వాతావరణం ఏర్పడింది. కానీ టెండర్ ఖరారు కాకపోవడంతో మత్స్య కారుల ఆందోళన చెందుతున్నారు. చేప పిల్లల విడుదలకు టెండర్ విధానం కాకుండా సొసైటీలకు నగదు బదిలీ చేస్తే సకాలంలో  తామే నాణ్యమైన విత్తన పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోసుకుంటామని చెబుతున్నారు.  

ఇప్పటికే  లేట్ అవుతుంది

పెద్ద వానలు పడడంతో చెరువులు, కుంటలు అన్నీ నిండినయ్. చేప పిల్లలను ఇప్పటికే పోయాల్సింది కానీ ఇంత వరకు పిల్లలను సప్లై చేయలేదు. లేట్ అయితే చేపలు పెరగవు. ప్రభుత్వం తొందరగా సీడ్ ను సప్లై చేస్తే బాగుంటుంది. మంగిలిపల్లి స్వామి, మత్స్యకారుడు, చల్మెడ

ప్రత్యామ్నాయ  ఏర్పాట్లు చేస్తున్నా..

ఈ సీజన్ లో జిల్లాకు 5.30 కోట్ల చేప  పిల్లలు అవసరమని ఆన్​లైన్​ద్వారా రెండు సార్లు టెండర్లు పిలిచాం. ఒక్క టెండర్ కూడా పడలేదు. దీంతో డిస్ట్రిక్ పర్చేస్ కమిటీ చైర్మన్ అయిన అడిషనల్ కలెక్టర్ ద్వారా ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ కు ప్రత్యామ్నాయ  ఏర్పాట్లు చేయాలని నివేదించాం. డీడీ నుంచి స్పష్టత రాగానే మత్స్యకారులకు చేప పిల్లలు అందేలా చర్యలు తీసుకుంటాం. మల్లేశం, జిల్లా ఫిషరీస్  ఆఫీసర్, మెదక్