- వాపస్ రావాలని ఆర్దర్స్ ఇచ్చిన యూపీఎస్సీ
- 23 లోగా ముస్సోరిలోని అకాడమీలో రిపోర్టు చేయాలని నోటీస్
పుణె: అధికార దుర్వినియోగం, తప్పుడు పత్రాలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు భారీ షాక్ తగిలింది. ఆమె ట్రైనింగ్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో పెడుతున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. జులై 23 లోపు ఎంత వీలైతే అంత తొందరగా ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో రిపోర్టు చేయాలని పూజా ఖేద్కర్‌కు నోటీసులు పంపింది.
సివిల్ సర్వీసెస్‌లో ఎంపికయ్యేందుకు ఆమె హ్యాండీక్యాప్డ్, ఓబీసీ సర్టిఫెకెట్లను తారుమారు చేశారనే ఆరోపణలతో పూజా ఖేద్కర్ ట్రైనింగ్‌ను టెంపరరీగా నిలిపివేస్తున్నామని నోటీస్‌లో పేర్కొంది. తదుపరి చర్యల కోసం ఆమెను జులై 23లోగా ముస్సోరిలోని అకాడమీకి రావాల్సిందిగా కోరినట్లు తెలిపింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర సర్కారుకు తెలియజేశామని చెప్పింది. దీంతో వాషిమ్‌లో సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్న పూజా ఖేద్కర్‌ను ఆ రాష్ట్ర అధికారులు వెంటనే రిలీవ్ చేశారు.
డిజేబిలిటీ సర్టిఫికెట్లు నకిలీవేనా!
యూపీఎస్సీకి సమర్పించిన పూజా ఖేద్కర్ వైకల్యానికి సంబంధించిన పలు సర్టిఫికెట్లు తాజాగా బయటపడ్డాయి. 2018, 2021లలో అహ్మద్ నగర్ జిల్లా హాస్పిటల్ నుంచి తీసుకున్న పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ (పీడబ్ల్యూబీడీ)సర్టిఫికెట్లను ఆమె యూపీఎస్సీకి సమర్పించారు. 2022 ఆగస్టులో పుణె జిల్లాలోని పింప్రి ఆస్పత్రి నుంచి లోకోమోటర్ డిజేబిలిటీ సర్టిఫికెట్ పొందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ సర్టిఫికెట్లో పూజకు మోకాలిలో 7శాతం వైకల్యం ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే, అదే నెలలో పూజ పుణెలోని మరో ఆస్పత్రి ఔంధ్ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ అంగవైకల్య ధ్రువీకరణకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, డాక్టర్లు టెస్టులు చేసిన తర్వాత తిరస్కరించారు. ఈ విషయాలన్నీ బయటపడటంతో పూజ మరింత చిక్కుల్లో పడింది.
మొదటి నుంచీ పూజ చుట్టూ అన్నీ వివాదాలే..
2023 బ్యాచ్ సివిల్స్ ర్యాంకర్ అయిన పూజా ఖేద్కర్..మితిమీరిన సౌలత్లు కోరడం, అధికార దుర్వినియోగంతో ఇటీవలే మహారాష్ట్రలోని పుణె నుంచి వాషిమ్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యారు. సివిల్స్ లో ఎంపికయ్యేందుకు ఆమె తప్పుడు పత్రాలు వినియోగించారని, ఓబీసీ రిజర్వేషన్‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలూ ఆమె ఎదుర్కొంటున్నారు.
దీనిపై విచారణకు కేంద్ర ప్రభుత్వం గతవారం ఏకసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె ట్రైనింగ్‌ను టెంపరరీగా నిలిపివేస్తూ యూపీఎస్సీ రీకాల్ ఉత్తర్వులిచ్చింది. కాగా, పూజా ఖేద్కర్ తల్లిదండ్రులు కూడా పరారీలో ఉన్నారు. ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి వాళ్లకోసం పుణె పోలీసులు వెతుకుతున్నారు.
