
- మనుస్మృతిపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ లా స్టూడెంట్లకు మను స్మృతి బోధించాలన్న ప్రతిపాదనలపై వివాదం చెలరేగుతున్న వేళ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనుస్మృతిలోని వివాదాస్పద భాగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. రాజ్యాంగం అసలైన స్ఫూర్తిని కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. హైదరాబాద్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘ఢిల్లీ యూనివర్సిటీ లా స్టూడెంట్లకు మనుస్మృతిని బోధించనున్నారనే సమాచారం మాకు అందింది.
యూనివర్సిటీ వీసీతో ఈ విషయంపై మాట్లాడాను. న్యాయశాస్త్ర చాప్టర్ లో కొంత మంది అధ్యాపకులు మార్పులు ప్రతిపాదించారని ఆయన నాకు వివరించారు. అకడమిక్ కౌన్సిల్ లో అటువంటి ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు. వీసీ కూడా ఆ ప్రతిపాదనను రిజెక్ట్ చేశారు. రాజ్యాంగం అసలైన స్ఫూర్తిని కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మనుస్మృతిలోని వివాదస్పద భాగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చం” అని పేర్కొన్నారు.