డెక్కన్ స్పోర్ట్స్​మాల్ బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధత

డెక్కన్ స్పోర్ట్స్​మాల్ బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధత
  • డెక్కన్ స్పోర్ట్స్​మాల్ బిల్డింగ్ కూల్చివేయాల్సిందే!
  •     ప్రమాదం జరిగిన బిల్డింగ్​ను పరిశీలించి బల్దియాకు రిపోర్టు
  •     శ్లాబ్​లు క్రాస్ అయినట్లు గుర్తింపు, రిపేర్లకు నో చాన్స్
  •     చుట్టుపక్కలవి డ్యామేజ్ కాకుండా కూల్చేందుకు ప్లాన్
  •     రెండు రోజులైనా ఘటనా స్థలాన్ని పరిశీలించని బల్దియా కమిషనర్
  •     యూఎస్​లో మేయర్.. గోవాలో డిప్యూటీ మేయర్ 

హైదరాబాద్, వెలుగు: భారీ అగ్నిప్రమాదం జరిగిన సికింద్రాబాద్​మినిస్టర్ ​రోడ్డులోని డెక్కన్ స్పోర్ట్స్ ​మాల్ బిల్డింగ్​ను కూల్చివేయాల్సిందేనని ఎన్ఐటీ వరంగల్ ​అధికారులు తేల్చారు. శుక్రవారం ప్రమాద స్థలాన్ని ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ రమణారావు, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రదీప్ పరిశీలించారు. బిల్డింగ్​ కూల్చడమే కరెక్ట్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. గంటల తరబడి మంటలు చెలరేగడంతో శ్లాబ్​లు క్రాస్ అయినట్లు గుర్తించారు. కింది ఫ్లోర్ ఎక్కువగా డ్యామేజ్ అయిందని, రిపేర్లకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బల్దియాకు రిపోర్టు ఇచ్చారు. బిల్డింగ్ పటిష్ఠతకు సంబంధించి అల్ట్రా సోనిక్ టెస్ట్ ​చేయాలని సూచించారు. దీంతో బల్దియా అధికారులు శనివారం బిల్డింగ్​లోని అన్ని ఫ్లోర్లు, పిల్లర్లు, కాలమ్స్ కి టెస్టులు చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మాల్​ బిల్డింగ్​ కూల్చివేయాల్సి వస్తే చుట్టుపక్కల ఇండ్లకు ఎలాంటి డ్యామేజీ జరగకుండా చూసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో మాదాపూర్ ప్రాంతంలో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వినియోగించిన మెషీనరీని వాడితే బాగుంటుందని మాలిక్ ట్రేడింగ్ అండ్ డిమాలేషన్ సంస్థ ప్రతినిధులను సంప్రదించారు. శుక్రవారం ఆ సంస్థ ప్రతినిధులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెండు, మూడు రోజుల్లో బిల్డింగ్​ను పూర్తిగా కూల్చివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ప్రమాద సమయంలో కనిపించకుండా పోయిన ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియలేదు.

పక్కనే ఉండి కూడా రాలే..

ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు అక్కడికి కొద్ది దూరంలో ఉండే జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు నుంచి కమిషనర్ లోకేశ్ కుమార్ రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు కూడా బల్దియా ఆఫీసుకే పరిమితమయ్యారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ సిక్ లీవ్​లో ఉన్నారు. ఇన్​చార్జిగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్​కి బాధ్యతలు అప్పగించారు. ప్రమాదం జరిగిన రోజు ఈవీడీఎం డైరక్టర్ విశ్వజిత్ కంపాటి మాత్రమే కనిపించారు. మరుసటి రోజు ఆయన కూడా రాలేదు. కేవలం కిందిస్థాయి అధికారులు మాత్రమే ఫైర్ సేఫ్టీ, పోలీసు అధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఉన్నతాధికారులు రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అమెరికా టూర్ లో ఉండగా, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి గోవాలో ఉన్నారు.

23న ప్రత్యేక సమావేశం

ఈ నెల 23న ఫైర్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ, పోలీస్​శాఖల అధికారులతో ఎంఏయూడీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్ కుమార్ సమావేశం కానున్నట్లు తెలిసింది. అగ్ని ప్రమాదానికి సంబంధించి శుక్రవారం నగరవాసులు ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.  మంటలు ఆర్పేందుకు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచాలని శ్రీధర్ అనే వ్యక్తి అర్వింద్ కుమార్ ను కోరగా.. అర్వింద్ కుమార్ స్పందిస్తూ షాపింగ్ మాల్స్, గోదాంలపై దృష్టి పెట్టునున్నట్లు తెలిపారు.