వంట నూనెల రేట్లు తగ్గినయ్

వంట నూనెల రేట్లు తగ్గినయ్
  • ధరలను దించేందుకు ట్యాక్స్ లు తగ్గించిన కేంద్రం  

న్యూఢిల్లీ: వంటనూనెల ధరలకు కళ్లెం వేసేందుకు బేసిక్ డ్యూటీ, అగ్రి సెస్ ట్యాక్స్ లను తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వంటనూనెలపై ఈ రెండు ట్యాక్స్ లను తగ్గించడంతో దేశవ్యాప్తంగా ధరలు తగ్గాయని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సెక్రటరీ సుధాంశు పాండే ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పామ్ ఆయిల్, పల్లీ నూనె, సన్ ఫ్లవర్ నూనెల ధరలు ఒక్కోచోట ఒక్కోలా రూ. 7, రూ. 10, రూ. 18, రూ. 20 మేరకు దిగొచ్చాయని వెల్లడించారు. దేశంలో వాడుతున్న మొత్తం వంటనూనెల్లో ఇవే 89% ఉన్నందున, వినియోగదారులపై గణనీయంగా భారం తగ్గుతుందని తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు అధికంగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో అదానీ విల్మర్, రుచి ఇండస్ట్రీస్ కంపెనీల నూనెల వోల్ సేల్ ధరలు లీటరుకు రూ. 4 నుంచి 7 వరకు తగ్గినట్లు కేంద్రం తెలిపింది. అలాగే జెమినీ ఎడిబుల్స్ (హైదరాబాద్), మోడీ నేచురల్స్ (ఢిల్లీ), గోకుల్ రిఫాయిల్స్, విజయ్ సాల్వెక్స్, గోకుల్ అగ్రో రిసోర్సెస్, ఎన్ కే ప్రొటీన్స్ కంపెనీల నూనెల వోల్ సేల్ ధరలూ గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. అయితే, గత ఏడాదితో పోలిస్తే.. ప్రస్తుతం వంటనూనెల ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నప్పటికీ, అక్టోబర్ నెల నుంచి ధరలు తగ్గుముఖం పట్టాయని తెలిపింది. 

ట్యాక్స్ ల తగ్గింపు ఇలా.. 
క్రూడ్ పామ్ ఆయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్ ఫ్లవర్ ఆయిల్ పై ఇప్పటివరకు 2.5 శాతం బేసిక్ డ్యూటీ ఉండగా, తాజాగా ఈ ట్యాక్స్ ను పూర్తిగా ఎత్తేసినట్లు కేంద్రం ప్రకటించింది. క్రూడ్ సోయాబీన్, క్రూడ్ సన్ ఫ్లవర్ ఆయిల్స్ పై అగ్రి సెస్ 20 శాతం ఉండగా, దానిని 5 శాతానికి తగ్గించినట్లు వెల్లడించింది. అలాగే క్రూడ్ పామ్ ఆయిల్ పై సెస్ ను 7.5 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. అన్ని వంటనూనెలపై బేసిక్ డ్యూటీ, అగ్రి సెస్ కలిపి ఇంతకుముందు 20 శాతం చొప్పున ఉండగా, ఇప్పుడు క్రూడ్ పామ్ ఆయిల్ పై 8.25%, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్ ఫ్లవర్ ఆయిల్ పై 5.5% మాత్రమే ఉన్నట్లు కేంద్రం వివరించింది. వంటనూనెలపై ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా రేషనలైజ్ చేశామని, ఆవనూనె ధరను కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.