వేల మందికి అవలీలగా వండిపెట్టే  కుక్​లు

వేల మందికి అవలీలగా వండిపెట్టే  కుక్​లు

మనదేశంలో వంట, వంటిల్లు అనగానే గుర్తొచ్చేది ఆడవాళ్లే. ఆ మాటకొస్తే ఏ దేశంలో అయినా కిచెన్​లో కనిపించేది మహిళలే. మన దగ్గరైతే చాలామంది మగవాళ్లు కనీసం వంటింట్లోకి కూడా అడుగుపెట్టరు. అందుకే ఎప్పుడైనా ఇంట్లోని ఆడవాళ్లు పుట్టింటికో, మరేదైనా పనిమీదనో వేరే ఊరెళ్లారంటే ఆ ఇంటి మగవాళ్లకు కర్రీ పాయింట్లు, పక్కింటోళ్లిచ్చే కూరలే గతి. కానీ, ఆ ఊళ్లోని మగవాళ్లకు ఈ సమస్య లేదు. ఎందుకంటే వాళ్లే నలభీములు. వేల మందికి అవలీలగా వండిపెట్టే  కుక్​లు. ఆ ఊరేంటో, వాళ్ల కథేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఇది చదవండి.  

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో కలయూర్​ అనే చిన్న పల్లెటూరు ఉంది. ఆ ఊళ్లో సుమారు 360 కుటుంబాలు ఉన్నాయి. జనాభా దాదాపు 1,700. ఆ ఊళ్లోకి అడుగుపెట్టగానే కడుపులో ఆకలి పరిగెత్తించేలా కమ్మటి వాసనలు గుప్పుమంటాయి. రకరకాల ఫుడ్స్​, స్వీట్స్, మసాలాల వాసనలు​ ‘రా..రమ్మని’  వెల్​కం చెప్తాయి. కనీసం ఇంటికొకరు చొప్పున కుక్​ ఉన్నారక్కడ. వాళ్లలో 200 మంది టాప్​​​​ కుక్​లు. 

ఐదొందల ఏండ్ల నుంచి

కలయూర్​లో ఉండేదంతా వన్నియార్​ జాలర్లే. కానీ, వీళ్ల వృత్తి చేపలు పట్టడం కాదు.. వంటలు చేయడం. దీని వెనక 500 ఏండ్ల చరిత్ర ఉంది. అదేంటంటే.. అప్పట్లో తమిళనాడులోని అగ్రకులాల్లో రెడ్డియార్​ ఒకటి. వీళ్లలో ఒకాయన తన ఇంట్లో వంట చేసేందుకు కలయూర్​కు చెందిన వ్యక్తిని వంటవాడిగా పెట్టాడు. కారణం.. వన్నియార్​లు జాలర్లు  అయినప్పటికీ వంటలు చేయడంలో మంచి నైపుణ్యం ఉండటమే. తమిళ సంప్రదాయ వంటలు బాగా చేసేవాళ్లు. అలాగే వాళ్లకు మాత్రమే తెలిసిన కొన్ని ప్రత్యేకమైన రెసిపీలు కూడా ఉండేవి. అలా గ్రామానికి చెందిన ఒకతను వంటమనిషిగా మారాక ఊళ్లోని మిగిలిన మగవాళ్లు కూడా అదే వృత్తిలోకి వెళ్లాలనుకున్నారు. చేపలు పట్టడంలో తగినంత ఆదాయం రాకపోవడం వాళ్లను అలా ఆలోచించేటట్లు చేసింది. గరిటెలు పట్టి వంటవాళ్లుగా మారేలా నడిపింది. మేటి వంటవాళ్లుగా తయారుచేసింది. 

పదేండ్లు పని నేర్చుకోవాలి

ఇప్పుడైతే వంట నేర్పించడానికి ‘హోటల్​ మేనేజ్​మెంట్​’ పేరుతో రకరకాల కోర్సులను కాలేజీల్లో చెప్తున్నారు.  రెండేండ్లు, మూడేండ్లు, నాలుగేండ్లు ఉండే ఆ కోర్సుల్ని పూర్తిచేశాక నేరుగా టాప్​ హోటల్స్​, రెస్టారెంట్లలో చెఫ్​లు అయిపోతున్నారు. కానీ, కలయూర్​లో మాత్రం వంట నేర్చుకోవడం అంత సులువు కాదు. కనీసం పదేండ్లు పని నేర్చుకోవాలి. ఆ తర్వాతే అతన్ని కుక్​గా గుర్తిస్తారు. అందువల్ల ఊళ్లోని మగపిల్లలు పది, పన్నెండేండ్ల వయసులోనే వంట నేర్చుకోవడం మొదలుపెడతారు. మొదట కూరగాయలు కోయడం, ఆకుకూరలను జాగ్రత్తగా తుంచడం వంటివి నేర్పిస్తారు. అలాగే తోటకు, మార్కెట్​కు వెళ్లి  కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకురావాలి. వాటిలో అవసరమైనవి, పనికివచ్చేవి జాగ్రత్తగా ఎంచుకోవాలి. అలాగే ఏ వంటలో ఎంతమేర మసాలాలు వేయాలి? ఉప్పు, కారం ఎంత ఉండాలి? కావాల్సిన మసాలాలను ఇంట్లోనే సొంతంగా ఎలా తయారుచేసుకోవాలి? అనేవి కూడా నేర్పిస్తారు. అయితే, ఇవన్నీ నేర్చుకున్న వెంటనే వంటమనిషి అయిపోరు. ఒక మెయిన్​ మాస్టర్​ దగ్గర అసిస్టెంట్​గా పనిచేయాలి. అలాగే సొంతంగా కొన్ని రెసిపీలు కూడా తయారుచేయాలి. ఆ తర్వాతే పూర్తి వంటమనిషిగా గుర్తిస్తారు. ఇంత కష్టం ఉంటుంది కాబట్టే కలయూర్​ మగవాళ్లు మనదేశంలోని టాప్​ రెస్టారెంట్స్​, హోటల్స్​లో చెఫ్​లుగా, కుక్​లుగా ఉన్నారు. కొంతమంది ఇతర దేశాలకు కూడా వెళ్లి పనిచేస్తున్నారు. అయితే, కలయూర్​ మగవాళ్లు వంటలో ఎంత గొప్పోళ్లు అయినప్పటికీ వాళ్ల ఇండ్లలో వంట చేసేది మాత్రం ఆడవాళ్లే!

ఎలా వెళ్లాలి? 

కలయూర్​కు జిల్లా కేంద్రం రామనాథపురంతోపాటు పరమకుడి నుంచి బస్​, రైలు సౌకర్యం ఉంది. రామనాథపురం నుంచి గ్రామానికి 30 కిలోమీటర్లు ఉంటుంది. బస్​ జర్నీకి అరగంట పడుతుంది. విమానంలో వెళ్లాలనుకుంటే గ్రామానికి 90 కిలోమీటర్ల దూరంలో​ని మధురై ఎయిర్​పోర్ట్​ ఉంది.