
బీరన్‌పూర్ : అతడో రోజు కూలీ.. పనికి వెళ్తే కానీ పూటగడవదు. అలాంటిది తన కొడుకు దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగాడు. నష్టపరిహారమిస్తామని చెప్పడం, నిందితులను అరెస్టు చేయకపోవడంతో.. కడుపు మండి ఎన్నికల బరిలో నిలిచాడు. తన కొడుకు ఫొటోతోనే ప్రచారం చేశాడు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిని ఈ సారి మట్టికరిపించి సంచలన విజయం సాధించాడు. చత్తీస్‌గఢ్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్. బెమెతార జిల్లాలోని బీరన్‌పూర్‌కు చెందిన ఈశ్వర్ సాహు రోజువారీ కూలీ. గత ఏప్రిల్‌లో బీరన్‌పూర్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఓ వర్గం చేసిన మూక దాడిలో కత్తిపోట్లకు గురై అతడి కొడుకు భువనేశ్వర్ సాహు (23) చనిపోయాడు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయలేదని, నిందితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని ఈశ్వర్ సాహు ఆరోపించారు.
తన కొడుకు మరణానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను సాజా అసెంబ్లీ సీటు నుంచి బీజేపీ నిలబెట్టింది. అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి రవీంద్ర చౌబే బరిలో ఉన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర రవీంద్ర చౌబేది. అయినప్పటికీ 1,01,789 ఓట్లను ఈశ్వర్ సాహు సాధించాడు. రవీంద్ర చౌబే పై 5,196 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఇప్పుడీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.