
హైదరాబాద్, వెలుగు: కేరళలోని త్రిసూరు వద్ద రైతులు అనుసరిస్తున్న సహకార వ్యవసాయం బాగుందని, ఈ తరహా సాగు పద్ధతి మన రాష్ట్రంలోనూ అనుసరించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. త్రిసూరులో జరిగిన ‘వాల్యూ యాడిషన్ ఫర్ ఇన్‌కమ్ జనరేషన్ ఇన్ అగ్రికల్చర్ (వీఏఐజీఏ)– 2020’ అంతర్జాతీయ సదస్సుకు మంత్రి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలను ఆయన ఈ సదస్సులో వివరించారు. కార్యక్రమంలో కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్, కేరళ చీఫ్ విప్ కె.రాజన్, ప్రభుత్వ అదనపు ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ దేవేంద్రకుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
వరిసాగు క్షేత్రం సందర్శన..
సదస్సు అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి త్రిసూరు సమీపంలోని పుల్లయి వరి సాగు క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ సాగు తీరు, వ్యవసాయ యాంత్రీకరణ, దిగుబడి, నీటి తీరువా, కూలీల పరిస్థితిపై రైతులతో ఆరా తీశారు. కూలీల కొరత తీవ్రంగా ఉందని, మగ కూలీలు రూ. 1000 పెట్టినా దొరకడం లేదని రైతులు వివరించారు. దీన్ని అధిగమించేందుకే దాదాపు 800 మంది రైతులు 900 ఎకరాల్లో సంఘటితమై సహకార సంఘం ఏర్పాటు చేసుకుని సాగుచేస్తున్నట్లు చెప్పారు. ఎకరానికి 30 నుంచి35 క్వింటాళ్ల దిగుబడి వస్తోందన్నారు.