
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. రైతుపై నమోదైన కేసును క్లోజ్ చేసేందుకు ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ లంచంగా ఆలుగడ్డలను డిమాండ్ చేశాడు. ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతను సస్పెండ్ అయ్యాడు. కన్నౌజ్ జిల్లాలోని భావల్‌పూర్ చపున్నా చౌకీలో రామ్ కృపాల్ సింగ్ అనే వ్యక్తి సబ్-ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఓ కేసును పరిష్కరించే విషయంలో అతను స్థానిక రైతు నుంచి లంచంగా 5 కిలోల ఆలుగడ్డలు డిమాండ్ చేశాడు.
అయితే, ఆ రైతు మాత్రం 2 కిలోల ఆలుగడ్డలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఎస్ఐ తన డిమాండ్ ను మళ్లీ రైతుకు తెలియజేశాడు. చివరకు 3 కిలోల ఆలుగడ్డలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఎస్ఐ మాటలను రైతు తన ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఆడియో కాస్త వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆడియోపై కన్నౌజ్ ఎస్పీ దర్యాప్తుకు ఆదేశాలిచ్చారు. విచారణలో రామ్ కృపాల్ సింగ్ రైతును లంచం అడిగింది నిజమేనని తేలింది. ఆలుగడ్డలు అనేది లంచానికి కోడ్ నేమ్ గా ఎస్ఐ ప్రయోగించినట్లు నిర్ధారణయ్యింది. దీంతో అతడిని ఎస్పీ శుక్రవారం సస్పెండ్ చేశాడు. రామ్ కృపాల్ సింగ్ పై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు.