మంత్రిపై కాల్పులు .. పోలీసుల అదుపులోకి ఏఎస్సై

మంత్రిపై కాల్పులు .. పోలీసుల అదుపులోకి ఏఎస్సై

ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబ కిసోర్ దాస్ పై కాల్పులు జరిపిన ఏఎస్సై గోపాల్ చంద్ర దాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్వీస్ రివాల్వర్‌తో ఏఎస్సై మంత్రిపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మంత్రిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రిపై ఏఎస్సై ఎందుకు దాడి చేశాడన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.  

మంత్రి నబ కిసోర్ దాస్ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఏఎస్సై గోపాల్ చంద్ర దాస్ కాల్పులు జరిపినట్లు ప్రత్యేక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. మంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. నబ కిసోర్ దాస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.  

బీజేడీ సీనియర్ నాయకుడైన నబకిషోర్ దాస్ ఇటీవల మహారాష్ట్రలోని ఒక ఆలయానికి కోటి రూపాయలకు పైగా విలువైన బంగారు  కలశాలను విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలోఒకటైన శని శింగనాపూర్ ఆలయానికి దాస్ 1.7 కిలోల బంగారం, 5 కిలోల వెండితో చేసిన కలశాలను విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.