కేరళలో చేపట్టిన హర్తాల్ (బంద్) హింసాత్మకం

కేరళలో చేపట్టిన హర్తాల్ (బంద్) హింసాత్మకం

తిరువనంతపురం/కొచ్చి: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌‌ఐ) ఆఫీసులు, లీడర్ల ఇండ్లపై దర్యాప్తు సంస్థల రెయిడ్స్‌‌ను వ్యతిరేకిస్తూ కేరళలో చేపట్టిన హర్తాల్ (బంద్) హింసాత్మకమైంది. నిరసనకారులు పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్టు బస్సులపై రాళ్లు రువ్వారు. షాపులు, వాహనాలను ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. ర్యాలీలు చేపట్టిన పీఎఫ్‌‌ఐ కార్యకర్తలు.. రోడ్ల ను బ్లాక్ చేశారు. బలవంతంగా షాపులను మూయించారు. రాళ్లు రువ్వడంతోపాటు ఇతర ఘటనల్లో పోలీసు సిబ్బంది, బస్సు, లారీల డ్రైవర్లు, ప్రయాణికులు గాయపడ్డారు. నిరసనకారులు.. తమ వెహికల్స్‌‌ను ఆపుతున్నప్పుడు, షాపులను మూయిస్తున్నప్పుడు పోలీసులు వేగంగా స్పందించలేదని స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హింసాత్మక చర్యలకు పాల్పడిన దాదాపు 500 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. 

రాష్ట్రవ్యాప్తంగా దాడులు

  •     తిరువనంతపురం, కొల్లాం, కోజికోడ్, వయనాడ్, అలప్పుజతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. పలు బస్సులను ధ్వంసం చేశారు. 
  •     కొట్టాయం జిల్లాలోని ఎరట్టుపేట పట్టణంలో పీఎఫ్‌‌ఐ మద్దతుదారులు.. వెహికల్స్‌‌ను బ్లాక్ చేసేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 
  •     కన్నూర్‌‌‌‌లోని నేషనల్ హైవేపై మంగళూరు నుంచి వస్తున్న లారీలను ఆపేశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నారాయణ్‌‌పరాలో న్యూస్ పేపర్లతో వెళ్తున్న వెహికల్‌‌పై దుండగులు పెట్రోల్ బాంబు      విసిరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 
  •     నిరసనకారులు రాళ్లు రువ్విన ఘటనల్లో కోజికోడ్‌‌లో 15 ఏండ్ల బాలిక, కన్నూర్‌‌‌‌లో రిక్షా డ్రైవర్‌‌‌‌కు గాయాలయ్యాయి. 

సూమోటోగా కేసు నమోదు చేసిన హైకోర్టు

పీఎఫ్‌‌ఐ చేపట్టిన హర్తాల్‌‌ హింసాత్మకం కావడం పై కేరళ హైకోర్టు సూమోటోగా కేసు నమోదు చేసింది. హర్తాల్‌‌ నిర్వహించడాన్ని గతంలోనే నిషేధించామని, ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. పీఎఫ్‌‌ఐ హర్తాల్ కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని, తమ ఉత్తర్వులను ఉల్లంఘించిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కన్నూర్‌‌‌‌లో తిరగబడ్డ జనం

కన్నూర్‌‌ జిల్లా‌‌లో షాపులను మూయించేం దుకు ప్రయత్నించిన పీఎఫ్ఐ కార్యకర్తలపై స్థానికులు తిరగబడ్డారు. పయ్యనూర్‌‌‌‌లోని సెంట్రల్‌‌ బజార్‌‌‌‌లో తమపై బల ప్రయోగం చేసేందుకు ప్రయత్నించిన వారిని తరిమి కొట్టారు. ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించా రు. ఇందుకు సంబంధించిన వీడియోలు స్థానిక టీవీల్లో ప్రసారమయ్యా యి. ఓ పీఎఫ్‌‌ఐ కార్యకర్తను జనం కలిసి కొట్టడం, పట్టుకుని పోలీసులకు అప్పగించడం అందులో కనిపించింది.