లాక్ డౌన్ పొడిగింపు: ఊరెళ్తామంటూ రోడ్ల‌పైకి వేలాది వ‌ల‌స కార్మికులు

లాక్ డౌన్ పొడిగింపు: ఊరెళ్తామంటూ రోడ్ల‌పైకి వేలాది వ‌ల‌స కార్మికులు

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం మే 3వ తేదీ వ‌ర‌కు దేశ వ్యాప్త లాక్ డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల‌కే ముంబైలో వేలాది వ‌లస కార్మికులు రోడ్ల‌పైకి వ‌చ్చేశారు. తామంతా సొంత ఊర్ల‌కు వెళ్లిపోతామ‌ని, ర‌వాణా స‌దుపాయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో ముంబైలోని బంద్రా బ‌స్ డిపో, రైల్వే స్టేష‌న్ల‌కు వేలాదిగా త‌ర‌లి వ‌చ్చారు వ‌ల‌స కూలీలు. త‌మ సొంత ఊర్ల‌కు వెళ్లిపోయేందుకు రైళ్లు, బ‌స్సులు న‌డ‌పాలంటూ నినాదాలు చేశారు. లాక్ డౌన్ లో జ‌నాలు గుంపులుగా బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని, సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌కుంటే ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని, వాళ్ల కోసం ఏర్పాటు చేసిన షెల్ట‌ర్ హోమ్స్ కి వెళ్లిపోవాల‌ని కోరారు పోలీసులు. కానీ, వాళ్లు ఏ మాత్రం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో స్థానికంగా లేబ‌ర్ లీడ‌ర్స్ తో చెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. అయినా తాము ఊరికి వెళ్లాల్సిందేన‌ని వ‌ల‌స కార్మికులు నినాదాలు చేయ‌డంతో పోలీసులు వాళ్ల‌ను వెన‌క్కి పంపేందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వ‌చ్చింది.

మాకు ఫుడ్ వ‌ద్దు.. సొంత ఊరి వెళ్లిపోతాం..

రోజువారీ కూలీ చేసుకుని క‌డుపు నింపుకునే వేలాది మంది వ‌ల‌స కార్మికుల‌ గ‌త నెల‌లో ప్ర‌క‌టించిన తొలి లాక్ డౌన్ తో ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయారు. ప్ర‌జా రవాణా లేక‌పోవ‌డంతో కొంత మంది వంద‌ల కిలో మీట‌ర్లు న‌డుచుకుంటూ సొంత ఊర్ల‌కు ప్ర‌యాణ‌మ‌య్యారు. అయితే ఒక‌చోటి నుంచి మ‌రో చోటుకు ప్ర‌జ‌లు ప్ర‌యాణాలు చేస్తే వైర‌స్ భారీ సంఖ్య‌లో వ్యాపించే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. దీంతో ఎక్క‌డివారిని అక్క‌డే ఆపేసి షెల్ట‌ర్ హోమ్స్ ఏర్పాటు చేశాయి.

ఇలా ముంబైలోనూ వేలాది మంది కార్మికుల‌ను షెల్ట‌ర్ల‌లో పెట్టి రోజూ ప్ర‌భుత్వం, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఆహారం అందిస్తున్నాయి. అయితే షెల్ట‌ర్ల‌తో పాటు కొన్ని స్ల‌మ్స్ లో అద్దెకు ఉంటున్న వేలాది మంది వ‌ల‌స కార్మికులు త‌మ‌కు ప‌నులు లేక‌పోవ‌డం వ‌ల్ల సొంత ఊర్ల‌కు వెళ్తామంటూ రోడ్ల‌పైకి వ‌చ్చారు. వారిలో ఎక్కువ మంది ప‌శ్చిమ బెంగాల్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు చెందిన వారు ఉన్న‌ట్లు తెలుస్తోంది. తొలి 21 రోజుల లాక్ డౌన్ కు స‌హ‌కరించిన‌ప్ప‌టికీ.. మ‌ళ్లీ 19 రోజులు పొడిగిస్తూ ఇవాళ ఉద‌యం ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో వాళ్లంతా రోడ్ల‌పైకి వ‌చ్చారు. త‌మ‌కు షెల్ట‌ర్ హోమ్స్ లో రోజూ ఆహారం అందుతోంద‌ని, కానీ ఇప్పుడు త‌మ‌కు ఫుడ్ వ‌ద్ద‌ని, సొంతూర్ల‌కు వెళ్లి పోనిస్తే ఎలాగోలా బ‌తుకుతామ‌ని చెబుతున్నారు కొంద‌రు వ‌ల‌స కూలీలు. ఇప్ప‌టి వ‌ర‌కు తాము క‌ష్టం చేసి దాచుకున్న డ‌బ్బంతా ఖ‌ర్చ‌యిపోయింద‌ని, ఇక ఎలా బ‌త‌కాలో తెలియ‌డం లేద‌ని ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన మ‌రో కార్మికుడు అన్నారు. ప్ర‌భుత్వం త‌మ ప్ర‌యాణానికి రైళ్లు, బ‌స్సులు ఏర్పాటు చేయాల‌ని కోరాడు.

పొలిటిక‌ల్ వార్…

వ‌ల‌స కార్మికులు, పేద ప్ర‌జ‌ల‌కు లాక్ డౌన్ స‌మ‌యంలో ఆర్థిక సాయం చేయ‌డంతో పాటు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయ‌డంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందంటూ బీజేపీ విమ‌ర్శ‌ల‌కు దిగింది. అయితే కేంద్రం స‌రైన ప్ర‌ణాళిక లేకుండా చేసిన ప‌నుల వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితులు త‌లెత్త‌యాయ‌ని కాంగ్రెస్ ఆరోపించింది.

ముంబై, సూర‌త్ స‌హా మ‌రికొన్ని ప్రాంతాల్లో వ‌ల‌స కార్మికులు రోడ్ల‌పైకి వ‌చ్చిన నిర‌స‌న‌లు చేస్తున్నార‌ని, ఈ ప‌రిస్థితికి కేంద్ర ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆరోపించారు మ‌హారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే. వారిని స్వ‌స్థ‌లాల‌కు పంపే విష‌యంపై కేంద్రం ఎటువంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంతో అల్ల‌ర్ల‌కు కూడా దిగుతున్నార‌ని అన్నారు. వాళ్లు ఇప్పుడు విసిగిపోయిన ఉన్నార‌ని, త‌మ‌కు ఆహారం వ‌ద్దు.. స్వ‌స్థలానికి వెళ్తామంటూ నినాదాలు చేస్తున్నార‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

సీరియ‌స్ నెస్ అర్థం చేసుకోండి

క‌రోనా వైర‌స్ వ్యాప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఉన్న తీవ్ర‌త‌ను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అర్థం చేసుకోవాల‌ని మ‌హారాష్ట్ర బీజేపీ నేత కిరీట్ సూచించారు. వేలాది మంది రోడ్ల‌పైకి రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని, ప్ర‌జ‌ల‌కు రేష‌న్, ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను అందించే విష‌యంలో రాష్ట్ర స‌ర్కారు మెరుగైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు.