యూపీ సర్కార్‌పై సాంగ్..గాయనికి నోటీసులు

యూపీ సర్కార్‌పై సాంగ్..గాయనికి నోటీసులు

ప్రముఖ భోజ్ పురి గాయని నేహా సింగ్ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాన్పూర్ లో అక్రమ ఇళ్లను తొలగిస్తుండగా తల్లీ, కూతుళ్లు మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో నేహా సింగ్ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ ఓ పాట పాడారు. ‘యూపీ మే కా బా సీజన్ 2’ పేరుతో ఈ పాటను యూట్యూబ్, ఫేస్ బుక్ లో విడుదల చేశారు. అనంతరం ఆమె తన పాట ద్వారా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ సీఆర్పీసీ160 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్పందించిన సింగర్ నేహా.. ఓ జానపద గాయకురాలిగా తన బాధ్యతను నిర్వర్తించేందుకే ప్రయత్నిస్తానన్నారు.  ఇలా సర్కార్ కు వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడం తనకేం కాదని.. ఎన్నికల సమయంలోనూ తాను అనేక ప్రశ్నలు సంధించానన్నారు. దానిపై వారు ఇప్పటికీ సమాధానాలు చెప్పలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు కూడా అదే చేశారని చెప్పారు. వారు సమాధానం ఇవ్వరని.. నోటీసులు మాత్రమే జారీ చేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ ఒక్క పార్టీని టార్గెట్  చేయడం లేదని, కేవలం అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడమే తన పని అంటూ వ్యాఖ్యానించారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా భయపడేది లేదన్న నేహా.. సాధారణ ప్రజల సమస్యలపై పాటలు పాడటం ఆపనని  స్పష్టం చేశారు.