ముగ్గురు పోలీసులకు వైరస్.. మూడు పోలీస్ స్టేషన్లు మూత

ముగ్గురు పోలీసులకు వైరస్.. మూడు పోలీస్ స్టేషన్లు మూత

మంగళూరు: ముగ్గురు పోలీసు సిబ్బందికి వైరస్ సోకినట్లు తేలడంతో కర్నాటకలోని ఉడిపి జిల్లాలో మూడు పోలీస్ స్టేషన్లను మూసివేశారు. అజెకర్, కర్కల, బ్రహ్మవర్ స్టేషన్లలో అసిస్టెంట్ సబ్ ఇనిస్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్​కి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. దీంతో మూడు స్టేషన్లతో పాటు ఒకే భవనంలో ఉన్న సర్కిల్ ఇనిస్పెక్టర్ కార్యాలయాన్ని కూడా మూసివేసినట్లు జిల్లా అధికారులు సోమవారం మీడియాకు తెలిపారు. వ్యాధి సోకిన పోలీసులు జిల్లాలోని ఐసోలేషన్ సెంటర్లలో ట్రీట్​మెంట్ పొందుతున్నారని, మూడు స్టేషన్లలో పనిచేస్తున్న 80 మంది సిబ్బందిని క్వారంటైన్ కి తరలించామని చెప్పారు. ఉడిపి డిప్యూటీ పోలీస్ కమిషనర్ జగదీశ్ మాట్లాడుతూ రెండు రోజుల్లో పోలీస్ స్టేషన్లను పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత తిరిగి తెరుస్తామని అన్నారు. వైరస్ బారిన పడిన వారి కాంటాక్ట్స్ ట్రేస్ చేస్తున్నామని చెప్పారు.