ఫారిన్ స్టడీస్ కు కరోనా బ్రేకులు

ఫారిన్ స్టడీస్ కు కరోనా బ్రేకులు

విదేశాలకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపని తెలంగాణ స్టూడెంట్స్

హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో హయ్యర్ స్టడీస్ చదవాలనుకున్న స్టూడెంట్స్ ఆశలకు కరోనా గండికొట్టింది. చాలా దేశాలు ఫారిన్ స్టడీస్ కు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇచ్చిన దేశాలకు వెళ్లేందుకు స్టూడెంట్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో చాలా మంది వచ్చే ఏడాదికి వాయిదా వేసుకుంటున్నారు. మొత్తంగా గతేడాదితో పోలిస్తే 80 శాతానికిపైగా స్టూడెంట్స్ డ్రాప్ అయ్యారని తెలుస్తోంది.

ఏటా 8 లక్షల మంది

ఇండియా నుంచి ఏటా సుమారు 8 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ విదేశాల్లో చదివేందుకు వెళ్తుంటారు. ఇందులో అత్యధికంగా అమెరికాకు రెండున్నర లక్షల మంది వరకు వెళ్తారు. కెనడా, బ్రిటన్ దేశాల్లో లక్ష చొప్పున, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈ, సింగపూర్, మలేసియా, నెదర్లాండ్ తో పాటు పలుదేశాలకు మిగిలిన స్టూడెంట్స్ పోతుంటారు. తెలంగాణ నుంచి ఏటా 40 వేల నుంచి 50 వేల మంది వరకు స్టూడెంట్లు స్టడీస్ కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఏటా ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో సుమారు 70 శాతం మంది, జనవరి–ఫిబ్రవరిలో 25 శాతం నుం చి 30 శాతం మంది వెళ్తుంటారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యా థమెటిక్స్ (స్టెమ్) కోర్సులే ఎక్కువగా మన స్టూడెంట్స్ చదువుతుంటారు. ఎంప్లాయ్ మెంట్ కోసం కొంతమంది నాన్ స్టెమ్ స్టూడెంట్స్ వెళ్తారు. అయితే ఈసారి నాన్ స్టెమ్ స్టూడెంట్స్ దాదాపు అందరూ డ్రాప్ అయ్యారని ఎడ్యు కేషన్ కన్సల్టెంట్స్ చెప్తున్నారు.

అమెరికాకు నో ఎంట్రీ

కరోనా తీవ్రతతో అమెరికాలోని చాలా యూనివర్సిటీలు ఇప్పటికీ అడ్మిషన్లు ప్రారంభించలేదు. కొన్ని ప్రారంభించినా, లిమిటెడ్ అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. ఈ మధ్యనే అమెరికా ఎంబసీ తెరుచుకుంది. సెప్టెంబర్లో ప్రారంభమయ్యే కొన్ని వర్సిటీల్లో చదివే స్టూడెంట్లకు మాత్రమే అనుమతిస్తున్నారు. కొన్నింటి నుంచి అడ్మిషన్ లెటర్లు వచ్చినా, వీసా అపాయిమెంట్ లేకపోవడంతో స్టూడెంట్స్ డ్రాప్ అవుతున్నారు. బ్రిటన్ , కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ వంటి దేశాల్లోకి ఎంట్రీ ఉన్నా వెళ్లేందుకు స్టూడెంట్స్ ఆసక్తి చూపడం లేదు. ఆగస్టులో వెళ్లాల్సిన చాలామంది జనవరి, ఫిబ్రవరికి షెడ్యూల్ మార్చుకున్నారు. అప్పటికీ తగ్గకపోతే, నెక్స్ట్ ఇయర్ పోవచ్చనే భావనలో ఉన్నారు.

పరిస్థితులు బాగోలేకనే

ఇక్కడి నుంచి ఫారిన్ వెళ్లే వారంతా చదువుతో పాటు అక్కడే ఏదో ఓ పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చని భావిస్తుంటారు. కానీ కరోనా ప్రభావంతో ప్రస్తుతం అక్కడ పనులు దొరికే పరిస్థితులు కన్పించడం లేదు. దీంతో ఆర్థిక భారం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొంత మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుతున్నారు. కరోనా కేసులు అమెరికా తోపాటు ఇతర దేశాల్లో కూడా ఎక్కువగా నమోదవుతుండటంతో ఇంకొంత మంది పేరెంట్స్ తమ పిల్లలను పంపించేందుకు ఇష్టపడటం లేదు.

ఆఫర్ లెటర్లు వచ్చినా..

మన దగ్గర గ్రేటర్ హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి ఎక్కువ మంది ఫారిన్ చదువులకు పోతుంటారు. ఈ ఏడాది కూడా వివిధ కన్సల్టెన్సీల ద్వారా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఆగస్టు, సెప్టెంబర్ లో కరోనా తగ్గిపోతుందని భావించి, మూడు నెలల ముందే దాదాపు 30 వేలమందికి పైగా స్టూడెంట్లు విదేశీ వర్సిటీల్లో అప్లై చేసుకున్నారు. దీంట్లో చాలా మందికి సీట్లు ఓకే చేస్తూ పలు వర్సిటీలు స్టూడెంట్లకు ఆఫర్ లెటర్లు కూడా పంపించాయి. దీన్ని కన్ఫామ్ చేసిన వారికి ఆగస్టులో ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇచ్చారు. కానీ వీటికి చాలా మంది స్టూ డెంట్లు అటెండ్ కాలేదు.

90 శాతం డ్రాప్ అయ్యారు

ఏటా మా కన్సల్టెన్సీ నుంచి ఐదు వేల మందికి పైగా స్టూడెంట్లను ఫారిన్ పంపిస్తుంటాం. కానీ ఈ ఏడాది చాలా తక్కువ మందినే పంపిస్తున్నాం. ఈ ఏడాది ఫారిన్ వెళ్లాలనుకున్న వారిలో 90 శాతం మంది డ్రాప్ అయ్యారు. అమెరికాలో పెద్దగా అవకాశాలు లేకపోవడమూ ఓ కారణం. కరోనాతో తమ పిల్లలను పంపించేందుకు పేరెంట్స్ భయపడుతున్నారు. దీంతో చాలామంది అబ్రాడ్ చదువులను వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం కన్సల్టెన్సీలకూ పెద్దగా పనిలేకుండా పోయింది. –వెంకటేశ్వరరెడ్డి, వరల్డ్ వైడ్ ఎడు కన్సల్టెంట్స్ ఎండీ

కరోనా తగ్గితే జనవరిలో పోత

నాలుగేండ్ల కిందనే బీటెక్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న. బ్రిటన్ లో ఎంఎస్ చేద్దామనుకున్న. గ్రీన్ విచ్ వర్సిటీకి అప్లై చేశా. సీటు ఓకే చేస్తూ వర్సిటీ ఆఫర్ లెటర్ పంపింది. సెప్టెంబర్ లో క్లాసులు ప్రారంభిస్తామని తెలిపింది. కానీ కరోనా తగ్గకపోవడంతో వెళ్లొద్దని డిసైడ్ అయిన. వైరస్ ఎఫెక్ట్ తగ్గితే జనవరిలో వెళ్తా. లేదంటే ఇక్కడే మాస్టర్ డిగ్రీ చేస్తా. – రాజిరెడ్డి పోతుల, పోసానిపేట, కామారెడ్డి జిల్లా.