ఈ చదువులు ఎందకురాబై అనుకునేటోళ్లు ఈ కథ చదవండి..!

ఈ చదువులు ఎందకురాబై అనుకునేటోళ్లు ఈ కథ చదవండి..!

శబరీపురం కొండల మధ్య ఉన్న ఓ కుగ్రామం. ఆ ఊరికి బడి లేదు. అందరూ నిరక్షరాస్యులే! చాలామంది జీవనోపాధి కోసం వేరే ఊళ్లకు వెళ్లి కూలీ పనులు చేస్తుంటారు. ఆ ఊరిలోని గంగాధరానికి ఏపని చేయాలన్నా బద్ధకం. సులభంగా ఏం చేయొచ్చా అని బాగా ఆలోచించి ఒకరోజు దొంగ అయితే వారం రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు అనుకున్నాడు. ఆ వెర్రి ఆలోచనతో దొంగతనానికి పూనుకుని రహదారిలో ఒంటరిగా వస్తున్న ఓ అమాయకుడిని కత్తితో బెదిరించి అతని దగ్గరున్న యాభై రూపాయలు దోచుకున్నాడు.

అలా దోచుకోవడం వల్ల గంగాధరానికి ధైర్యం వచ్చి మరిన్ని దొంగతనాలు చేయాలనుకున్నాడు. ఒకసారి ఒక చెట్టు కింద ఓ యోగి పండ్లు తింటూ అతనికి కనిపించాడు. యోగి పక్కనే ఒక మూట ఉంది. ఆ మూటను దొంగిలించి అందులోని ధనమో,  బంగారమో చేజిక్కించుకుంటే తను హాయిగా బతకొచ్చని తలచాడు. అందుకే రహస్యంగా చెట్టు వెనుక వైపు నుంచి వచ్చి మూటను ఎత్తాడు. అంతే అందులో నుంచి కంచు గిన్నెలు కదలాడిన శబ్దం వచ్చింది. యోగి కళ్లు తెరిచి గంగాధరాన్ని చూసి విషయం అర్థం చేసుకున్నాడు.

‘‘ఆగు నాయనా. నేను ఊరూరు తిరిగే దేశ దిమ్మరిని. నీ సమస్య చెప్పు తీరుస్తాను” అన్నాడు యోగి.
‘‘నాకు బాగా బతకడానికి డబ్బు కావాలి’’
‘‘నువ్వేం చదువుకున్నావు’’ అడిగాడు యోగి.
‘‘ఏం చదువుకోలేదు’’
‘‘ఏ కళలో అయినా ప్రవేశం ఉందా?’’
 ‘‘ఏ కళా లేదు ముందు డబ్బు ఇవ్వు’’ కోపంగా అన్నాడు గంగాధరం.
‘‘కోపం వద్దు నాయనా ఇంతకూ నీ ఊరు ఏది?’’
‘‘శబరీపురం’’
‘‘మీ ఊరు నాకు తెలుసు. అక్కడ నల్లటి రాళ్లు ఎక్కువ. ఏ శిల్పి అయినా వాటిని చెక్కి అందమైన శిల్పాలుగా మారిస్తే ఆ శిల్పికి డబ్బే డబ్బు’’
‘‘నాకు శిల్పాలు చెక్కడం రాదు’’
‘‘నాకు తెలిసిన శిల్పి శిల్పాపురంలో ఉన్నాడు. అతను శిల్పాలు చెక్కడం నేర్పిస్తాడు. అతనికి ఒక కాలు లేదు అందుకే ఎక్కడికీ రాడు. ఎవరైనా ఆ కళ నేర్చుకోవాలంటే ఆయన దగ్గరకే వెళ్లాలి. నేను ఒక యోగిని నా దగ్గర డబ్బు, బంగారం ఉండవు. మంచి ఉపాయంతో ధనం సంపాదించే మార్గం చెప్పగలను. నేను చెప్పినట్టు చేస్తే నీకు సంఘంలో మంచి పేరు, ధనం వస్తాయి. నువ్వు శిల్ప కళ నేర్చుకుంటానంటే ఆ శిల్పకారుడి దగ్గరకు తీసుకెళ్తాను. ఆయనే తిండి పెట్టి శిల్ప కళ నేర్పిస్తాడు’’ చిరునవ్వుతో చెప్పాడు యోగి.

యోగి మంచి మాటలు గంగాధరాన్ని ఆలోచనల్లో పడేశాయి. శిల్ప కళ నేర్చుకుంటానన్నాడు.
ఆ విధంగా గంగాధరం కష్టపడి మూడేళ్లలో శిల్పకళ మీద పట్టు సాధించి మంచి శిల్పి అని పేరు తెచ్చు కున్నాడు.


యోగి చెప్పినట్టు శబరీపురంలో నల్లటి రాళ్లను అద్భుత శిల్పాలుగా మలిచాడు. అతని కళ చూడాలని శబరీపురం వచ్చిన యోగి ఆ శిల్పాలు చూసి ఆశ్చర్యపోయి గంగాధరం చేత సుందరమైన కృష్ణ దేవాలయం కట్టించాడు. గుడి కట్టడానికి యోగి భక్తుడైన జమీందారు ధన సాయం చేశాడు. ఆ గుడి, శిల్పాల వల్ల శబరీపురానికి గొప్ప పేరు వచ్చింది. ఊరికి బడి, గుడి ఏర్పడ్డాయి. ఆ ఊర్లో ఎంతోమంది చదువుకున్నారు. ‘‘చూశారా.. ఒక వ్యక్తి నేర్చుకున్న విద్యను ప్రజలకు మేలు చేసే విధంగా ఉపయోగిస్తే ప్రజలు బాగుపడతారు.’’ అని ప్రజలందరి ముందు గంగాధరాన్ని అభినందించాడు యోగి.