
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని నాగోల్లో దారుణం జరిగింది. పెళ్లి సమయంలో 20 లక్షల కట్నం ఇచ్చినా అతని ధన దాహం తీరలేదు. అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్త.. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె గొంతు కోశాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు బాధితురాలిని నాగోల్లోని సుప్రజ ఆస్పత్రికి తరలించారు. గత ఏడాది క్రితమే మహాలక్ష్మికి(20), వేణుగోపాల్కు వివాహమైంది. అదనపు కట్నం తేవాలని పెళ్ళైన నెల నుంచే భార్యను చితకబాదుతూ వేణుగోపాల్ వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఒకానొక సమయంలో మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. వేణుగోపాల్ వ్యవహార శైలిపై పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది.
పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన కొన్ని రోజులు మనిషిలానే ప్రవర్తించిన వేణుగోపాల్ మళ్లీ తనలోని మృగాన్ని నిద్రలేపాడు. మహాలక్ష్మిని గతంలో మాదిరిగానే వేధించాడు. భార్య గొంతు కోసేంతలా అతని శాడిజం చేరింది. పోలీసులు వేణుగోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో బాధితురాలి పేరెంట్స్ ఆస్పత్రికి రీచ్ కాలేకపోయారు. అయినా పైసా చెల్లించకున్న ప్రాణాలను కాపాడేందుకు ట్రీట్మెంట్ చేసేందుకు సుప్రజా ఆస్పత్రి యాజమాన్యం ముందుకు రావడం విశేషం. మొదట ఆమె ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఆస్పత్రి యాజమాన్యం సర్జరీ కూడా చేసింది.