మళ్లీ 60 వేల పైనే:   దేశంలో రెండు వారాలుగా  పెరుగుతున్న కరోనా కేసులు

మళ్లీ 60 వేల పైనే:   దేశంలో రెండు వారాలుగా  పెరుగుతున్న కరోనా కేసులు
  • 24 గంటల్లో 62,714 మందికి.. ఒక్కరోజే 312 మరణాలు.. 
  • మహారాష్ట్రలోనే 108 మంది  కర్నాటకలో ఈ నెలలో 
  • 470 మంది చిన్నారులకు వైరస్‌ ‌ గత 24 గంటల్లో 
  • 62,714 మందికి పాజిటివ్‌‌  ఒక్కరోజే 312 మంది మృతి..
  • మహారాష్ట్రలోనే 108 మరణాలు.. కర్నాటకలో 470 మంది చిన్నారులకు వైరస్‌‌


న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. రెండు వారాలుగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 62,714 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 1.19 కోట్లు దాటాయి. ప్రస్తుతం 4.86 లక్షల యాక్టివ్‌‌ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1.13 కోట్ల మంది వైరస్‌‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌‌ అయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఈ వివరాలను వెల్లడించింది. వైరస్‌‌ బారిన పడి ఒక్క రోజులోనే 312 మంది మరణించారు. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 108 మంది చనిపోయారు. పంజాబ్‌‌లో 45 మంది, కేరళలో 14 మంది, చత్తీస్‌‌గఢ్‌‌లో 13 మంది, ఢిల్లీలో 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు 1.61 లక్షలు దాటాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 24 కోట్ల శాంపిల్స్‌‌ను టెస్టు చేసినట్టు ఐసీఎంఆర్‌‌ వెల్లడించింది. శనివారం 11 లక్షల టెస్టులు చేశామంది. దేశంలో ఇప్పటివరకు 6.02 కోట్ల మంది వ్యాక్సిన్‌‌ తీసుకున్నారు.  
మహారాష్ట్రలో 3 లక్షల యాక్టివ్‌‌ కేసులు
మహారాష్ట్రలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో అక్కడ 40,414 కేసులు నమోదయ్యాయి. 14,523 మంది డిశ్చార్జ్‌‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27.13 లక్షల మంది వైరస్‌‌ బారిన పడగా 23.14 లక్షల మంది కోలుకున్నారు. 54,181 మంది మరణించారు. ప్రస్తుతం 3.04 లక్షల యాక్టివ్‌‌ కేసులున్నాయి. 
కర్నాటకలో చిన్న పిల్లలకు..
కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ నెల మొదటి నుంచి ఇప్పటివరకు పదేళ్లలోపు చిన్నారులు 470 మంది కరోనా బారినపడ్డారు. వీళ్లలో 244 మంది అబ్బాయిలు, 228 మంది అమ్మాయిలు ఉన్నారని అక్కడి అధికారులు చెప్పారు. ఈ నెల మొదట్లో రోజుకు 10 మంది చిన్నారుల్లోపే వైరస్ బారినపడే వారని, ఇప్పుడా సంఖ్య 46కు పెరిగిందని తెలిపారు. గతంలో లాక్‌‌డౌన్ వల్ల చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారని, వైరస్ బారిన పడే అవకాశం తక్కువగా ఉండేదని ఎక్స్‌‌పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పుడు పిల్లలు బయటకు వస్తున్నారని, ఈవెంట్లలో పాల్గొంటున్నారని, స్కూల్స్ కూడా తెరుచుకోవడంతో ఎక్కువగా కరోనా బారినపడుతున్నారని అంటున్నారు. 
జమ్మూకాశ్మీర్‌‌లో 4,200 మందికి బెయిల్‌‌
కరోనా నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌‌లో గత మార్చి నుంచి ఇప్పటివరకు 4,204 మంది ఖైదీలకు బెయిల్‌‌ ఇచ్చినట్టు డీజీపీ వీకే సింగ్‌‌ వెల్లడించారు. 41 మందిని పెరోల్‌‌పై విడుదల చేశామన్నారు. ప్రస్తుతం ఖైదీల్లో ఒక్కరికే కరోనా సోకిందని, అతనికి కథువాలోని హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ అందిస్తున్నామని చెప్పారు.


హోలీ వేడుకలు ఇంట్లోనే జరుపుకోండి: కేజ్రీవాల్‌‌
కరోనా కేసులు పెరుగుతుండటంతో తాను ఏ హోలీ ప్రోగ్రామ్‌‌కు హాజరుకాబోనని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌ వెల్లడించారు. ప్రజలు కూడా బయటకు రాకుండా ఫ్యామిలీతో పండుగ జరుపుకోవాలని కోరారు. శనివారం ఢిల్లీలో 1,558 కేసులు నమోదయ్యాయి. కాగా, ఢిల్లీలోని తీహార్‌‌ జైలులో కరోనా వ్యాక్సినేషన్‌‌ సెంటర్‌‌ను ఏర్పాటు చేసినట్టు ఢిల్లీ జైళ్ల శాఖ వెల్లడించింది.

బ్రెజిల్‌‌ రకం భయపెడుతోంది
బ్రెజిల్‌‌, దక్షిణ ఆఫ్రికా రకం కరోనా వైరస్‌‌లు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. యాంటీబాడీలు, వ్యాక్సిన్లకు లొంగకుండా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇటీవల సెల్‌‌ జర్నల్‌‌లో పబ్లిష్‌‌ అయిన ఓ రీసెర్చ్‌‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. బ్రెజిల్‌‌, దక్షిణ ఆఫ్రికా వైరస్‌‌లు యాంటీబాడీలను న్యూట్రలైజ్‌‌ చేస్తూ ప్రస్తుత వ్యాక్సినేషన్‌‌ ప్రాసెస్‌‌కు అడ్డుతగులుతున్నాయంది. అందరికీ వ్యాక్సిన్లు వేసే వరకు కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించింది.