తెలంగాణలో డెత్ రేటు, కేసులు పెరుగుతున్నాయి

తెలంగాణలో డెత్ రేటు, కేసులు పెరుగుతున్నాయి

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో కరోనా డెత్ లు, కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాలు దేశ సగటు కన్నా మన దగ్గరే ఎక్కువగా ఉన్నాయి. దేశంలో 1.86 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 5 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా మరణాల సగటు రేటు 2.83% గా ఉంటే రాష్ట్రంలో 3.1% గా నమోదైంది. నెల రోజులుగానే మరణాల సంఖ్య పెరుగుతోంది. చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన దగ్గర డెత్ రేటు ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఐసీఎంఆర్ రూల్స్ పేరుతో కొన్ని మరణాలను సర్కారు ప్రకటించలేదు. వాటిని కూడా కలిపితే డెత్ రేట్ ఇంకా ఎక్కువగా ఉండేదని డాక్టర్లు చెప్తున్నారు.

‘పాజిటివ్’ పెరుగుతోంది

నెల రోజులుగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే పాజిటివ్ రేటు ఏకంగా 3.1 శాతం పెరిగింది. నెల రోజుల క్రితం ప్రతి వంద టెస్టుల్లో 5.1 శాతం మందికి వైరస్ పాజిటివ్ ఉంటే ఇప్పుడు అది 8.22 శాతానికి చేరింది. మే 30 న నాటికి 30,388 మందికి టెస్టులు చేయగా.. 2,499 మందికి అంటే (8.22 శాతం) కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు నెలతో పోల్చుకుంటే ఇది 3.1 శాతం ఎక్కువ. ఈ లెక్కన రాష్ట్రంలో నెమ్మదిగా కరోనా వ్యాప్తి పెరుగుతోందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ రేటులో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండగా ఇప్పుడు మూడో స్థానానికి చేరింది. తొలి రెండు స్థానాల్లో మహారాష్ట్ర 14.5 శాతం, ఢిల్లీ 8.97 ఉన్నాయి. సరిగా టెస్టులు చేయిస్తున్నందునే పాజిటివ్ రేటు పెరుగుతోందని సర్కారు అంటోంది. కానీ మొదట్లో చేసిన నిర్లక్ష్యం కారణంగా వైరస్ వ్యాప్తి పెరిగిందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. మొదట్లోనే కరోనా పాజిటివ్ కేసుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తించి సరైన చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు.

ఎక్కువ టెస్టులతో కంట్రోల్​ చేయొచ్చు

లాక్ డౌన్ సడలింపుల తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో వ్యాప్తి మరింత ఎక్కువ ఉంది. అసలు ఎవరి ద్వారా ఎవరికీ కరోనా సోకుతుందో కూడా తెలియటం లేదు. మైగ్రెంట్ లేబర్స్ రాక, జనం రద్దీ పెరగటం, జిల్లాల నుంచి హైదరాబాద్ కు రాకపోకల కారణంగా వైరస్ ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. చాలా వరకు ఎసింప్టమాటిక్ క్యారియర్ల ద్వారా కరోనా ఎక్కువ మంది సోకే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం లక్షణాలుంటేనే కరోనా టెస్టులు చేస్తామని చెబుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎసింప్టమాటిక్ కేసులే ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఎంత ఎక్కువ టెస్టులు చేస్తే అంత మంచిదని ఎక్స్ పర్టులు స్పష్టం చేస్తున్నారు. లేకుంటే కేసులు, మరణాలు భారీగా పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో ఒక్కరోజే 199 కరోనా కేసులు