హర్యానాలో వారం రోజులపాటు లాక్ డౌన్

 హర్యానాలో వారం రోజులపాటు లాక్ డౌన్

చండీగఢ్: రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో రేపటి నుంచి వారం రోజులపాటు లాక్ డౌన్ విధించింది హర్యానా రాష్ట్రం. సోమవారం నుంచి వారం రోజులపాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర హోం మరియు వైద్య ఆరోగ్యశాఖా మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. కరోనా సునామీలా విరుచుకుపడుతుండడంతో ఇప్పటికే 9 జిల్లాల్లో లాక్ డౌన్ విధించిన హర్యానా ప్రభుత్వం ఇప్పుడు లాక్ డౌన్ ను రాష్ట్రమంతా విధిస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హర్యానాలో శనివారం నాడు అత్యధికంగా 13 వేల 588 కేసులు నిర్ధారణ అయ్యాయి. 125 మంది కరోనా కాటుకు బలై కన్నుమూశారు. ఇంకో వైపు ఆక్సిజన్ నిల్వలు, వ్యాక్సిన్ నిల్వల కొరతను నివారించేందుకు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. రేపటి నుంచి వారం రోజులపాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని.. అయితే నిత్యావసర సరుకులు, మందులు, రవాణా వాహనాలకు మినహాయింపు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీని ఆనుకుని ఉన్న హర్యానాలో కరోనా విజృంభణ మొదలు కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు ఎవరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని.. లాక్ డౌన్ ను స్వచ్ఛందంగా పాటించడంతోపాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనాను కట్టడి చేయాలని హర్యానా ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది.